పగిలిన అద్దం ఇంట్లో ఉంటే ఏమవుతుంది!

అద్దం పగిలితే అరిష్టం, పగిలిన అద్దంలో మొహాన్ని చూసుకోకూడదు, పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు, మరకలు పడిన లేదా మాసిపోయిన అద్దాన్ని అస్సలే ఉంచకూడదు, అద్దం లక్ష్మీదేవి అని చాలా చెబుతారు. ఇంతకీ వీటిలో నిజమెంత? నిజంగానే పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదా…

ప్రతిబింబం కదిలితే అశుభం
ఇప్పుడంటే అద్దాలొచ్చాయి కానీ పూర్వకాలంలో అద్దాలు లేనప్పుడు నదులు, సరస్సులు, చెరువులలో ప్రతిబింబం చూసుకునేవారు. ఈ ప్రతిబింబాలు మన ఆత్మలాగే మనతోనే ఉంటాయి నమ్మేవారు. అలాంటప్పుడు ప్రతిబింబం ఏమాత్రం అటూ ఇటూ అనిపించినా, తేడాగా కనిపించినా అశుభం అనుకునేవారు. ప్రతిబింబం కదలకూడదు అనే సెంటిమెంట్ అద్దాలు వచ్చాక…పగిలిన అద్దంలో చూసుకోకూడదు అనేలా మారింది.

అద్దం అమ్మవారి స్వూరూపం
అద్దం అమ్మవారి స్వరూపం అని, గడియారం ఈశ్వర స్వరూపం అని విశ్వసిస్తారు. లక్షీ స్వరూపంగా భావించే అద్దం పగిలితే ఏదో కీడు జరుగుతుందనే సంకేతం. సంపద నష్టపోతారని, ఇంట్లో మనశ్సాంతి ఉండదని చెబుతారు. ఎందుకంటే అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలకడగా ఉండదు..లక్ష్మీదేవి కూడా ఒకే దగ్గర ఉండిపోదంటారు. అద్దం ముక్కలైనట్టే సంపద చెల్లాచెదురు అయిపోతుందని నమ్మకం. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం ఉంటే, ఇంట్లోకి ప్రవేశించే ఆరోగ్యకరమైన శక్తి పరావర్తనం చెంది తిరిగి వెళ్లిపోతుందని విశ్వసిస్తారు. దైవ స్వరూపంగా భావించడం వల్లే మైల వచ్చినప్పుడు అద్దాన్ని వినియోగించనివ్వరు పెద్దలు.

అద్దంలో ఆత్మ ఉంటుందని విదేశీయుల సెంటిమెంట్
అద్దం పగిలితే హిందువులు కొన్ని విశ్వశించినట్టే విదేశీయులూ కొన్ని పాటిస్తుంటారు. ముఖ్యంగా రోమన్లు, గ్రీకులు, చైనీయులు, ఆఫ్రికన్లకి అద్దం చాలా సెంటిమెంట్. అద్దం మనను ప్రతిబింబిస్తుందని, అది పగిలిందంటే మన రూపం ఛిద్రమైనట్టే..అంటే మరణించే సమయం ఆసన్నమైందని తెలసుకోవాలంటారు. అమెరికా, ఐర్లాండ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలవారికి ఓ బలమైన నమ్మకం ఉంది. తెలిసినవాళ్లెవరైనా చనిపోతే, వెంటనే ఇంట్లో ఉన్న అద్దాలన్నిటి మీదా గుడ్డ కప్పేస్తారట. చనిపోయి వారి ఆత్మ వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోదని, తనవాళ్ల చుట్టూ తిరుగుతుందని, తనకు ఆశ్రయమిచ్చే మరో శరీరం కోసం వెతుకుతుందని, అది దొరికేవరకూ అద్దంలో తలదాచుకుంటుందని అంటారు. అందువల్లే ఎక్కడ ఆ ఆత్మ వచ్చి చేరుతుందో అని భయపడి అద్దాలను కప్పేస్తారట.

శాస్త్రీయంగా చెప్పాలంటే పగిలిన అద్దంలో చూసుకుంటే కళ్లకు మంచిది కాదంటారు. పొరపాటున చిన్న గాజు పెంకు గుచ్చుకున్నా కొన్నిసార్లు ప్రాణాపాయం జరగొచ్చు. ఆరోగ్య పరంగా చెప్పేకన్నా అరిష్టం అంటే తొందరగా అర్థమవుతుందని అలా చెప్పారు పెద్దలు.

గమనిక: కొందరు పండితుల నుంచి, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.