గాజులు వేసుకోపోవడం ఫ్యాషన్ అనుకుంటున్నారా!

పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా సందడే సందడి. మహిళలు కళకళలాడుతూ కనిపిస్తారు. అయితే చాలామంది చేతులకు మాత్రం ఏదో మొక్కుబడిగా సింగిల్ బ్యాంగిల్ తప్ప నిండుగా గాజులే కనిపించవు. గాజులు వేసుకోపోవడం కూడా ఓ ఫ్యాషన్ అనుకునేవారున్నారు. ఇంతకీ గాజులు ఎందుకు వేసుకోవాలో తెలుసా అసలు…

ముత్తైదువ అని చెప్పే ఐదు అలంకారాల్లో గాజులు ఒకటి. గాజులంటే మట్టి లేదా బంగారంతో చేసినవి అయి ఉండాలి. అంతేకానీ ప్లాస్టిక్ గాజుల కానేకాదు. ఒకప్పుడు ఇళ్లలో ఆడపిల్లలు గాజులు వేసుకోపోతే పెద్దవారు కోప్పడే వారు. ఏంటి బోడి చేతులు పెట్టుకుని తిరుగుతున్నావ్ అనేవారు. ఎవరికి కలిగినంతలో వాళ్లు ఆడపిల్లలకు చేతులనిండుగా గాజులు వేసి గలగలలాడుతుంటే చూసి మురిసిపోయేవారు. అసలు గాజులు అందం కోసం కాదు ఆరోగ్యం కోసం అని ఎంత మందికి తెలుసు?

గుండె నరానికి గాజులకు లింక్
చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ్ అనే నరం నేరుగా గుండె నరాలతో సంబంధాన్ని కలిగిఉంటుంది. వైద్యులు కూడా ఈ నాడి స్పందనే గమనిస్తారు. ఈ నరం దగ్గర గాజులుండడం వల్ల శరీరంలో రక్త పోటుని అదుపులో ఉంచుతుంది. అందుకే గాజులు వేసుకోవాలని చెబుతారు. పురుషులు సహజంగా శారీరక శ్రమ ఎక్కువ చేస్తారు. వారిలో ఉండే కొవ్వు శాతం తక్కువకావడంతో రక్తపోటు సమస్యలు కూడా తక్కువ. కొందరిలో ఇలాంటి సమస్యలుంటే బంగారం లేదా రాగి కడియం ధరించమని అందుకే చెబుతారు. లోహంతో చేసిన కడియం శరీరంలో వేడిని గ్రహిస్తాయి.

రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది
గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గాజులు వేసుకున్న మణికట్టు భాగంలో Blood circulation వేగం పెరుగుతుందట. దీనికి కారణం మణికట్టు భాగంలో రాపిడికి గురికావడమే. అంతేకాదు చేతులు అటూ ఇటూ కదలడం వల్ల గాజులు వెనక్కీ ముందుకు కదలడం వల్ల blood vessels కు మంచి మసాజ్ అవుతుంది. దాంతో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది

గాజులు వేసుకుంటే అలసిపోరు
గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట. అంతేకాదు వీటివల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. తద్వారా ఒత్తిడిని, అలసటను, నొప్పులను భరించే శక్తి అందుతుంది. ముఖ్యంగా గర్భిణులు చేతినిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే గర్భిణులకు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతంది. ఆ సమయంలో గర్భిణులు అలసటకు గురవుతారు. ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు చెబుతారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులు వేసుకోవడం వల్ల డెలివరీ టైం వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తున్నారు.

మట్టి గాజులు ఆరోగ్యం
మట్టి గాజులను వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తొలగిపోతుంది. మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా ఈ గాజులను నివారించగలవు. గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..