ఏపీలో మోదీ సభకు భారీ ఏర్పాట్లు – 17న చిలుకలూరిపేటలో చరిత్ర సృష్టించే సభ

ఏపీలో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తున్నారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ రేపు సాయంత్రం 4 గంటలకు ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. మూడు పార్టీలు ఏర్పాటు చేసిన ఈ సభకు ‘ప్రజాగళం’ అని నామకరణం చేశారు. తాజాగా ఈ సభ లోగోను విడుదల చేశారు. మధ్యలో ప్రధాని మోదీ, ఆయనకు ఇరువైపులా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉన్నారు. ప్రజాగళం సభ ద్వారా మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపైకి రానున్నారు.

రాష్ట్రం కోసం పొత్తులు

రాష్ట్ర హితం.. అభివృద్ధి కోసం.. జగన్మోహన్‌రెడ్డి అరాచకపాలనను అంతమొందించి.. 5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో తామంతా ఏకతాటిపైకి వచ్చినట్లు తెలుగుదేశం-జనసేన-బీజేపీ నేతలు అన్నారు. తమ కూటమి రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆదివారం నిర్వహించే భారీ బహిరంగసభ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్‌ దశ, దిశ నిర్దేశించబోతోందని నమ్మకంగా ఉన్నారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు

పొత్తు కుదిరిన అనంతరం నిర్వహిస్తున్న ప్రథమ సభ కావడంతో మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2014లో కూడా మూడుపార్టీలు కలిసి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించి, విజయ దుందుభి మోగించాయి. అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు కూడా ఉమ్మడి గుంటూరు గడ్డపై నుంచి ఎన్నికల సమరశంఖం పూరించనున్నాయి. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ హాజరుకాబోతున్న సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలిరానున్నారు.

బస్సులు ఇస్తున్న ఆర్టీసీ

ప్రతిపక్షాల హెచ్చరికలో, మరో కారణమో.. ఏమో కానీ మొత్తానికి ఏపీఎస్ ఆర్టీసీ దిగొచ్చింది. చిలకలూరిపేటలో ఈ నెల 17న తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ భారీ బహిరంగ సభకు బస్సులు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇన్నాళ్లూ ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఒక్క బస్సు ఇచ్చేందుకు కూడా ససేమిరా అన్న ఆర్టీసీ యాజమాన్యం ఇప్పుడు మాత్రం ఎన్ని బస్సులు కావాలో చెప్పాలని కోరడం విశేషంఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం వెనక కారణం వేరే ఉందని చెబుతున్నారు. చిలకలూరిపేట సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా హాజరవుతుండడమే ఇందుకు కారణమన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రధాని హాజరయ్యే సభకు బస్సులు ఇవ్వకుండా ఆయన ఆగ్రహానికి గురికావడం భావ్యం కాదని భావించే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.