బీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్ – ఖమ్మం నుంచి ఆ నేత బీజేపీలోకి !

తెలంగాణలో బీజేపీ ఎవరూ ఊహించని వ్యూహంతో ముందడుగు వేస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడ్ని మార్చిన తర్వాత .. నేతలు సైలెంట్ అయ్యారని ప్రచారం చేస్తున్నారు. కానీ తెర వెనుక పరిస్థితులు చక్క బెడుతున్నారని.. వివిధ కారణాలతో ఇప్పటి వరకూ పార్టీలో చేరలేని వారికి ఉన్న ఆటంకాలు తొలగిస్తున్నారని క్లారిటీ వస్తోంది. ఖమ్మం జిల్లాలో రాజకీయాలను మార్చే నేత బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమవుతుంది.

బీజేపీతో తుమ్మల చర్చలు

ఖమ్మంలో ఓ బలమైన నేత కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ., .. తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరుపుతోంది. ఆయన కూడా ఇప్పటికే బీజేపీ పెద్దలతో మాట్లాడారు. తుమ్మల నాగేశ్వరరరావు ఖమ్మం జిల్లా సీనియర్ నేత. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి పూర్తి స్థాయిలో పాతుకుపోయారు. ఖమ్మంలో జరిగిన ప్రతి అభివృద్ధి వెనుకా ఆయన పాత్ర ఉంటుంది. టీడీపీలో ఉన్న తుమ్మలను కేసీఆర్ పిలిచి .. మంత్రిని చేశారు. కానీ తర్వాత ఆయన రాజకీయ జీవితాన్ని ముగించే ప్రయత్నం చేశారు.

తుమ్మలను మోసం చేసిన కేసీఆర్

పాలేరు నుంచి గత ఎన్నికల్లో తుమ్మల పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి .. బీఆర్ఎస్ లో చేరడంతో ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు. తుమ్మల పార్టీ మారుతారని చాలా సార్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యక్ష రాజకీయాల్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని మాత్రం చెబుతూ వస్తున్నారు. ఈ సారి కేకే రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం లేదని.. దాన్ని తుమ్మలకు ఇస్తామన్న లీకుల్ని కేసీఆర్ ఆయన వద్దకు చేరేలా చేశారు. అయితే కేసీఆర్ ను నమ్ముకున్న మండవ వంటి వారి పరిస్థితి ఏమయిందో తెలుసు కదా అని అయన అనుచరులు .. వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే పోటీ చేయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు.

27న అమిత్ షా సమక్షంలో చేరే అవకాశ ం

కాంగ్రెస్ లో పొంగులేటి చేరారు. బీజేపీకి బలమైన నేత లేరు. ఈ నెల 27న అమిత్ షా బహిరంగసభ ఖమ్మంలో ఉంది. ఆ సభలో తుమ్మలను చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తుమ్మల పార్టీ మారుతారా లేదా అన్న సంకేతాలు లేవు. ఆయన… బీఆర్ఎస్ పెద్దలతో సన్నిహితంగానే ఉన్నారు. కానీ తనపై ఓడిపోయిన వ్యక్తిని తెచ్చుకుని.. టిక్కెట్ ఇవ్వడం తనను ఏ మాత్రం గౌరవించడం కాదని ఆయన అనుకుంటున్నారు. అందుకే పార్టీ ని వీడిపోవడానికి ప్రత్యేకమైన భావోద్వేగం ఏమీ ఉండదని… చెబుతున్నారు. బీజేపీ పార్టీలో నేతల్ని చేర్చుకునే విధానం వేరుగా ఉంటుంది. వారు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే తుమ్మల బీజేపీ లో చేరిపోవడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.