ఉద్ధవ్ ఆరోపణలు… ఫడ్నవీస్ గట్టి కౌంటర్లు…

ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో విభేదించినప్పటి నుంచి ఏదోక ప్రేలాపనకు దిగుతూనే ఉన్నారు. కమలం పార్టీపై బురద జల్లేందుకు ప్రయత్నించి అభాసుపాలవుతున్నారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయనకు సరికొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి. అప్పుడు బీజేపీ ఏదో చెప్పిందంటూ ఆయనకు ఆయనే మాటలు మాట్లాడుతున్నారు.బీజేపీ నేతలు ఏదో తన చెవిలో చెప్పారన్నట్లుగా రహస్యాలను ఇప్పుడు బట్టబయలు చేస్తున్నానంటూ నవ్వుల పాలవుతున్నారు….

ఆదిత్య ఠాక్రేను సీఎం చేస్తామన్నారట…

ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు పాత విషయమంటూ కొత్త మాటను బయట పెట్టారు. తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ ప్రకటించినట్లుగా ఒక సభలో ఉద్ధవ్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఫడ్నవీస్ , కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన నివాసానికి వచ్చారని..అప్పుడే అధికారాన్ని పంచుకునే విషయం చర్చకు వచ్చిందని ఆయన చెప్పారు. బీజేపీ, శివసేన చెరి రెండున్నర సంవత్సరాలు అధికారాన్ని పంచుకునే ప్రతిపాదన చేశారన్నారు. ఆ క్రమంలో తాను తొలుత సీఎం పదవిని తీసుకుంటానని, రెండున్నరేళ్ల కాలంలో ఆదిత్య ఠాక్రేకు ట్రైనింగ్ ఇచ్చి సీఎంను చేస్తానని ఫడ్నవీస్ చెప్పినట్లుగా ఉద్ధవ్ వెల్లడించారు.

అమిత్ షాతో రహస్య భేటీ….

ఇద్దరు నేతలు తమ నివాసానికి వచ్చినప్పుడు ఫడ్నవీస్ ను బయట కూర్చోబెట్టి… అమిత్ షా మాత్రమే ఒక గదిలో తనతో భేటీ అయ్యారని ఉద్ధవ్ చెప్పుకున్నారు. అధికారాన్ని పంచుకునేందుకు అంగీకారం కుదిరిన తర్వాత ఫడ్నవీస్ తనతో మాట్లాడుతూ రెండున్నరేళ్లు సీఎంగా చేసిన తర్వాత తాను ఢిల్లీ వెళ్లిపోతానని అప్పుడు ఆదిత్య సీఎం అవుతారని కూడా చెప్పారన్నారు.అయితే ఆదిత్యకు ఇప్పుడే తొందరలేదని తను వారించానన్నారు.

ఉద్ధవ్ కు మతి స్థిమితం లోపించిందన్న ఫడ్నవీస్..

ఉద్ధవ్ తాజా వ్యాఖ్యలపై ఫడ్నవీస్ ఓ రేంజ్ లో విరుచుకపడ్డారు. ఊహాజనితంగా, హాలూసినేషన్ తో ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆరోపించారు. అమిత్ షా, ఉద్ధవ్ ఏకాంత భేటీ జరగనే లేదని కూడా వెల్లడించారు. ఆదిత్యను సీఎం చేస్తానని చెప్పడం ఒట్టి ట్రాషేనన్నారు. ఆయనకు మంత్రి పదవి కూడా తమ అజెండాలో లేదన్నారు. ఉద్దవ్ మాటలు విచిత్రంగా ఉంటాయని ఫడ్నవీస్ విశ్లేషించారు. అమిత్ షా తనను సీఎం చేస్తానని హామీ ఇచ్చినట్లుగా ఉద్ధవ్ తొలుత చెప్పుకున్నారని, ఇప్పుడు తన కొడుక్కి ఆ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారన్నారు. బీజేపీ ఇప్పుడు ఒకటే మాట చెబుతోంది. ఇకపై ఎప్పుడు ఉద్ధవ్ ఠాక్రేతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చేసింది..