వాయుపుత్రుడా? కేసరీ తనయుడా?..ఆంజనేయుడి జన్మ రహస్యం ఏంటి!

ఆంజనేయుడి అంతా మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ పరి పరి విధాలుగా స్తుతిస్తారు. అంజనాదేవి గర్భాన ఉదయించాడు కాబట్టి ఆంజనేయుడు అంటారు. మరి తండ్రి ఎవరు?…. శివపురాణంలో ఏముంది? పరాశరసంహితలో ఏముంది?

శివమహాపురాణం ప్రకారం
రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్కలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు మహాబల పరాక్రమాలుగల వానరదేహంతో ఆమెకు జన్మించి రామకార్యంలో సహాయపడ్డాడని చెబుతారు. తండ్రే తనయుడవుతాడనే (ఆత్మావై పుత్రనామాసి) సూక్తివల్ల, హనుమంతుణ్ని శివనందనుడుగా, రుద్రుడి అంశగా కీర్తిస్తారు.

పరాశర సంహింత ప్రకారం
పరమేశ్వరుడి పదకొండో అవతారమే హనుమంతుడని పరాశర సంహిత ధృవీకరించింది. త్రిపురాసుర సంహారంలో శ్రీ మహావిష్ణువు శివుడికి సహకరిస్తాడు. అందుకు కృతజ్ఞతగా రామావతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆంజనేయుడిగా వచ్చి రుద్రుడు సహకరించాడని పరాశర సంహిత చెబుతోంది. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. అప్పుడు శివుడి వీర్యాన్ని భరించలేక పార్వతీదేవి అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్నిదేవుడు వాయుదేవుడికి ఇస్తాడు…దాన్ని ఓ పండుగా మలిచి పుత్రుడికోసం తపస్సు చేస్తోన్న అంజనాదేవికి ఇస్తాడు వాయుదేవుడు. అలా జన్మించిన వాడే ఆంజనేయుడు. వాయుప్రసాదించిన ఫలం కావడం వల్ల వాయునందనుడు అని అంటారు.

మరి కేసరి ఎవరు?
దేవలోకంలొని పుంజికస్థల అనే అప్సరస…బృహస్పతి శాపంవల్ల భూలోకంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మించింది. ఆమే అంజనాదేవి. వానరరాజైన కేసరి భార్య అయింది. వాల్మీకి రామాయణం ప్రకారం కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినపుడు..అంజనాదేనిని వాయుదేవుడికి అప్పగిస్తాడు. అంజన అందానికి మోహితుడైన వాయుదేవుడు ఆమెను మనసుతోనే అనుభవిస్తాడు. ఆ తర్వాత రుద్రుడి తేజస్సుతో వచ్చిన ఫలాన్ని తీసుకొచ్చి ఇచ్చి హనుమంతుడి పుట్టుకకు కారణం అయ్యాడు.

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.