గోవాలో ఉన్న ఈ శివాలయం చాలా ప్రత్యేకం!

గోవా అంటే బీచ్ లు, పార్టీలు, పర్యాటకం మాత్రమే అనుకుంటారంతా. కానీ ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారికి కూడా గోవా చాలా ప్రత్యేకం. ఇక్కడ బీచ్ లు మాత్రమే కాదు ఎన్నో పవిత్ర దేవాలయాలున్నాయి. ముఖ్యంగా భోళాశంకరుడు తనంతట తాను కొలువైన ఆలయం ఇక్కడ చాలా ప్రత్యేకం.

గోవా రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిలో చాలా ప్రత్యేకం సాక్షాత్తు పరమేశ్వరుడు కొలువైన శ్రీమంగేష్ మందిరం. పనాజీకి 22 కి.మీ. దూరంలో ఉంది ఈ ఆలయం. స్థలపురాణం ప్రకారం ఒకసారి కైలాసంలో ఆటలాడుతుండగా పార్వతీదేవి చేతిలో ఓడిపోయిన శివయ్య..ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఏర్పరుచుకున్నాడట. భర్తని వెతుకుతూ అమ్మవారు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సమయంలో పార్వతి ముందు పులిరూపంలో ప్రత్యక్షమయ్యాడు అర్థనారీశ్వరుడు. హఠాత్తుగా వచ్చిన పులిని చూసి నిశ్చేష్టురాలైన పార్వతీ దేవి వెంటనే తేరుకుని ‘త్రాహి మాం గిరీశ’అంటూ ప్రార్థించింది. అంటే పర్వతాలకు ప్రభువైన దేవా రక్షించు అని అర్థం. వెంటనే ఈశ్వరుడు తన పూర్వరూపంలోకి రావడంతో అమ్మవారి ఆనందానికి అవధుల్లేవు. మాం గిరీశీ అన్న పదమే కాలక్రమంలో మంగేశ్‌గా మారింది.

జువారి నది ఒడ్డున పార్వతికి శివుడు ప్రత్యక్షమైన ప్రదేశంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం ఈ ప్రాంతాన్ని ఫోర్చుగీసువారు ఆక్రమించి ఆలయాన్ని నిర్మూలించారు. అయితే కొందరు భక్తులు శివలింగాన్ని ఆ సమీపంలో ప్రియల్‌కు తరలించి నాలుగు శతాబ్ధాల పాటు అక్కడే పూజలు నిర్వహించారు. 18వ శతాబ్దంలో మరాఠా సైన్యాధికారి రామచంద్ర సుక్తాంకర్‌ ఆలయాన్ని పునర్‌ నిర్మించి శివలింగాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ ఉన్న ఎత్తైన దీపస్తంభం ప్రత్యేక ఆకర్షణ. ప్రధాన దేవాలయంతో పాటూ వినాయక, భైరవ, ముక్తేశ్వర్‌, గ్రామదేవత శాంతేరి, దేవి భగవతి.. దేవుళ్లు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. గోవా రాజధాని పనాజీకి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలున్నాయి.

శివగాయత్రి
తత్పురుషాయ విద్మహే । మహాదేవాయ ధీమహి ।
తన్నో రుద్ర: ప్రచోదయాత్ ।।

“ఓం తత్పుర్షాయ విద్మహే మహాదేవాయ ధీమహి
తన్నో రుద్రః ప్రచోదయాత్”

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.