ఆంజనేయుడు పాకిస్థాన్‌లో స్వయంభువుగా వెలసిన క్షేత్రం ఇది!

విభజన పాకిస్తాన్ లో ఎన్నో హిందూ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అక్కడున్న హిందూ సంఘం ఎన్నో దేవాలయాలను పరిరక్షిస్తూ నిర్వహిస్తోంది. అలాంటి ఆలయాల్లో ఒకటి కరాచిలోని ఉన్న పంచముఖ ఆంజనేయ ఆలయం.

శ్రీరామభక్తుడైన ఆంజనేయుడి ఆలయం లేని ఊరుండదు. కేవలం ఊర్లలో మాత్రమే కాదు వందలకిలోమీట్లు ప్రయాణించే ఏ మార్గంలో చూసినా దారి పొడవునా హనుమంతుడు అభయహస్తంతో దర్శనమిస్తూనే ఉంటాడు. భారతదేశంలో మాత్రమే కాదు పాకిస్థాన్ లోనూ వాయుపుత్రుడికి ఆలయాలున్నాయి. వాటిలో ఒకటి కరాచీలో ఉంది. ఇక్కడ స్వామివారు పంచముఖాలతో స్వయంభువుగా వెలసి యుగయుగాలుగా పూజలందుకున్నాడు.

రాముడు నడయాడిన ప్రాంతం కరాచీ
వనవాసంలో భాగంగా సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ విడిచి చేసినట్టు స్థలపురాణం చెబుతోంది. పురావస్తుశాఖ అధ్యయనంలో ఈ ఆలయం 1500ఏళ్ల క్రితం నిర్మించినట్టు వెల్లడయింది. ఆంజనేయుడు స్వయంభువుగా ఇక్కడ వెలసినట్టు తెలుస్తోంది. హనుమ, నారసింహ, ఆదివరాహ, హయగ్రీవ, గరుడ ముఖాలతో నీలం, తెలుపు రంగులలో 8 అడుగుల పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం పూజలందుకోంటోంది. ఈ ఆలయంలో మూలవిరాట్‌ ఉన్న ప్రాంగణంలో 21 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరువెరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. కొన్ని సంవత్సరాల క్రితమే ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలయ ప్రాంగణ తవ్వకాల్లో పురాతనమైన వానర మూకల విగ్రహాలతోపాటు కృష్ణుడు, వినాయకుడు వంటి ఎన్నో విగ్రహాలు వెలుగుచూశాయి.

దాడుల నుంచి తప్పించుకున్న ఆలయం
భారతదేశంలో బాబ్రీ కట్టడం కూల్చివేత తర్వాత ఈ ప్రాంతంలోని దేవాలయాల మీద జరిగిన దాడుల నుంచి బయటపడిన పాకిస్తాన్లోని కొన్ని హిందూ దేవాలయాలలో ఇది ఒకటి. బాబ్రీ మసీదు అల్లర్లలో ఈ ఆలయాన్ని అక్కడి హిందువు, సింధియాలు పరిరక్షించారు. తర్వాత ఈ మందిరాన్ని అక్కడ హిందూ సమితి పునర్నిర్మించింది. ప్రస్తుతం ఆ ఆలయంలో పంచముఖి హనుమాన్ విగ్రహంతో పాటు శ్రీరాముడు, సీతాదేవి, పంచముఖి వినాయకుడు, కృష్ణుడు, శివుడు, వంటి అనేక విగ్రహాలను ప్రతిష్టించారు. ఈకరాచీలో ఉన్న హిందువులకు శ్రీ పంచముఖి హనుమాన్‌ ఆలయం అత్యంత పవిత్రమైన ప్రదేశం.

హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్
త్రిమూరత్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్
నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్
పంచాక్షర స్థితం దేవం నీల నీరద సన్నిభమ్..!!

పెద్ద చెక్కిళ్లు గలవాడు, వాయుదేవుని వరప్రసాదంతో పుట్టినవాడు, బ్రహ్మచారి, త్రిమూర్తి స్వరూపుడు, ఆత్మజ్ఞాని, మంకెనపువ్వులాగా ఉన్నవాడు, దేదీప్యమానంగా ప్రకాశించే సమస్తమైన నగలను ధరించినవాడు, పంచబీజాక్షరాలతో ఉన్నవాడు, నల్లని మేఘంతో సమానమైనవాడు అయిన హనుమంతుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని దీని భావం.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.