విష్ణు సహస్ర నామం చదివినంత ఫలితం ఇచ్చే శ్లోకం ఇది!

శ్రీరామ రామ రామేతి , రమే రామే మనోరమే
సహస్ర నామ తతుల్యం, రామ నామ వరాననే!!

ఈ రెండు లైన్ల శ్లోకం చదివితే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం లభిస్తుందంటారు పండితులు. శ్రీరాముడివి ఎన్నో శ్లోకాలుండగా ఇదే ఎందుకంత పవర్ ఫుల్? పైగా ఈ శ్లోకం మొత్తం రామనామమే ఉంది..అలాంటప్పుడు విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం ఎందుకు వస్తుంది? ఈ సందేహాలకు సమాధానం స్వయంగా పరమేశ్వరుడే పార్వతీ దేవికి చెప్పాడు..

రామ – ర, అ, మ కారాలు

‘ర’కారము రుద్రుని
‘అ’కారము బ్రహ్మను
‘మ’కారము విష్ణువుని సూచిస్తుంది
అందుకే ‘రామ’శబ్దం బ్రహ్మవిష్ణు, శివాత్మక రూపం అని చెబుతారు..

‘రామ’అనే శబ్దం జీవాత్మ పరమాత్మలకు స్వరూపం
‘రా’అనే అక్షరాన్ని ‘తత్’అని అనగా ‘పరబ్రహ్మము’
‘మ’ అనే అక్షరానికి ‘త్వం’ అనగా జీవాత్మ అని అర్థం

అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ నమఃలో ‘రా’ బీజాక్షరం
పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయలో ‘మ’ బీజాక్షరం
ఈ రెండు మంత్రాల శక్తిని రామ నామం కలిగి ఉంది

అత్యంత శక్తివంతమైన రామ మంత్రం జపంవల్ల మోక్షం లభిస్తుంది. అందుకే హరిహరాత్మకమైన ఈ ‘రామ’నామ మంత్ర రాజాన్ని తారక మంత్రం అం
అంటారు. భవబంధాల నుంచి తరింపచేయడంవల్లనే ‘రామ’మంత్రాన్ని తారక మంత్రమని పిలుస్తారు. త్రిమూర్తి స్వరూపంగా చప్పే ‘రామ’నామాన్ని నిత్యం పఠించి ఆంజనేయుడు దైవమయ్యాడు. రామనామమే తన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా భావించి కబీరు, భక్తరామదాసులాంటి మహాభక్తులు స్వామి కృపకు పాత్రులై ఖ్యాతి పొందారు. రామ నామంలోని విశిష్టత తెలిసిన పరమేశ్వరుడు ఆ మంత్రాన్ని జపించమని సాక్షాత్తు పార్వతి మాతకు చెప్పాడు. పైగా శివకేశవులకు భేదం లేదని తెలిపే ఈ నామ స్మరణ వల్ల సర్వసౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అందుకే మరోసారి చదువుకోండి…

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..