మరణానంతరం వెంట వచ్చేవి ఈ రెండే!

శరీరం యదవాప్నోతి యచ్ఛాపుత్రామతీశ్వరః॥
గృహీత్వైతాని సంయాతి వాయుర్గస్థానివావయాత్।।

పంచేంద్రియాలతో కూడిన ఈ శరీరంలోంచి పరమాత్ముడి ప్రతిబింబం అయిన కాంతి తొలగిపోతే మరణం సంభవిస్తుంది. అప్పుడు పూలపైనుంచి వీచే గాలి ఆ పూల వాసనను ఎలా తీసుకెళ్లిపోతుందో మనోబుద్ధి అహంకారాలతో కూడిన సూక్ష్మశరీరం ఆ శరీరంలో తాను అనుభవించిన వాసనలను తనతో గ్రహించేస్తుంది. కాలపరిమితి దాటిన తర్వాత జీవాత్మ బయటకు వచ్చేయడమే మరణం. ఆ సమయంలో ఏం జరుగుతుందో వివరించాడు శ్రీ కృష్ణుడు..

మనిషి తన జీవిత కాలమంతా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. ధనం, ఆస్తి, రాజ్యం, పదవి, భార్య, సంతానం, బంధువులు, మిత్రుల చుట్టూనే జీవితం గడిచిపోతుంది. కానీ ఇవేవీ కూడా మరణించేటప్పుడు వెంటరావు. ఆ విషయం తెలిసినా తెలియనట్టే జీవితాన్ని గడిపేస్తాడు…అదే అజ్ఞానము. మరణానంతరం శరీరం నుంచి బయటకు వచ్చిన జీవుడు తాను పంచేంద్రియాలతో, మనసుతో చేసిన మంచి పనులు చెడ్డ పనుల వాసనలను తన వెంట తీసుకెళ్తాడు. ఆ వాసనలతోనే మరొక శరీరంలో ప్రవేశిస్తాడు.

వెంట వచ్చేవి రెండే
మరణానంతరం జీవుని వెంట వచ్చేవి రెండే రెండు. ఒకటి సూక్ష్మశరీరము. రెండు ఆ సూక్ష్మశరీరానికి అంటుకుని ఉన్న కర్మల వాసనలు. ఈ వాసనలు, సంస్కారములు శుద్ధంగా ఉంటే, మంచి జన్మ వస్తుంది. ఈ వాసనలు అపరిశుద్ధంగా ఉంటే నీచజన్మ లభిస్తుంది. మనం మరుజన్మ ఏది పొందాలో అది మన చేతిలోనే ఉందంటాడు పరమాత్ముడు. మనసు, ఇంద్రియముల సూక్ష్మతత్వాలు తప్ప మనతో పాటు గడ్డిపరక కూడా రాదు, బంధువులు, మిత్రులు, భార్యబిడ్డలు, శ్మశానం దాకా వస్తారు. ధనము, ఆస్తులు, ఏవీ వెంటరావు. అవేవీ మరణాన్ని ఆపలేవు, మంచి జన్మ ఇవ్వలేవు. కేవలము మనస్సు, ఇంద్రియతత్వములు వాటితో చేసిన మంచి కర్మల వాసనలే అతని మరు జన్మ నిర్ణయం అవుతుంది.

వాయువే ఉదాహరణ
జీవుడు-ప్రయాణం-మరుజన్మ గురించి స్పష్టంగా అర్థమయ్యేందుకు శ్రీ కృష్ణుడు అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. గాలి అంతటా వీస్తూ ఉంటుంది. పూల మీది నుంచి మంచి వాసనలు, మలినపదార్థముల నుంచి చెడు వాసనల ప్రభావం రెండింటినీ కలపి తీసుకెళ్లిపోతుంది. సూక్ష్మదేహం కూడా తన వెంట మానవుడు తన జీవిత కాలంలో చేసిన కర్మలను తనతో తీసుకెళ్లిపోతాడు. వాయువుకు ఎటువంటి పక్షపాతము లేనట్టే జీవాత్మకు కూడా ఎటువంటి పక్షపాతము లేదు. అంటే కేవలం మంచి వాసనలను మాత్రమే తీసుకుని, చెడు వాసనలు వదిలిపెట్టదు. అన్ని వాసనలను తనతో పాటే తీసుకెళ్లిపోతుంది. అందుకే జీవిత కాలంలో మనసుతో, ఇంద్రియములతో మంచి కర్మలు చేస్తే ఆ జీవుడు మంచి జన్మపొందుతాడు. లేదంటే నరకప్రాయమైన జన్మ తప్పదు.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.