రాజకీయ ఖర్చు ఊహించనంత – విలవిల్లాడిపోతున్న అభ్యర్థులు

ఎన్నికల ఖర్చుపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పోలింగ్‌కు సమయం ఎక్కువగా ఉండటంతో ఎన్నికల ప్రచారానికే భారీగా ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఖర్చును ఎలా తగ్గించుకోవాలో తెలీక అభ్యర్థులంతా తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. నాలుగో విడతలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 18న విడుదల కానుంది. మే 13న పోలింగ్‌ జరగనుంది.

గతంలో తొలి విడతలోనే ఎన్నికలు

గతంలో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు తొలి విడతలోనే జరిగేవి. మార్చి పదో తేదీకి అటుఇటుగా షెడ్యూల్‌ విడుదలవ్వగా ఏప్రిల్‌ 16వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ ముగిసేది. గత ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు నెల రోజులు ఎన్నికల ప్రక్రియ వెనక్కి వెళ్లింది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల షెడ్యూల్‌ రాకుండానే ప్రచారం ప్రారంభించారు. షెడ్యూల్‌ వచ్చిన తర్వాత రెండు నెలల వ్యవధి రావడంతో భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఏర్పడటంతో అంతా విలవిల్లాడుతున్నారు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, రెండు లోకసభ స్థానాలు ఉన్నాయి. అభ్యర్థులంతా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ మందీమార్భలంతో ఇంటింటికీ ప్రచారం సాగిస్తున్నారు. తక్కువగా లెక్కించినా ప్రచార ఖర్చు రోజుకు రూ.ఐదు నుంచి రూ.ఆరు లక్షలు వరకూ అవుతున్నట్లు అభ్యర్థులు లెక్కలు చెబుతున్నారు.

ప్రతీది ఖర్చే

భోజనాలు, మద్యం, డీజిల్‌ ఇతర ఖర్చులు భారీగా అవుతున్నట్లు చెబుతున్నారు. షెడ్యూల్‌ విడుదలైన తర్వాత పోలింగ్‌ సమయానికి దాదాపు రెండు నెలలు వ్యవధి రావడంతో ప్రచార ఖర్చు నిమిత్తమే దాదాపు రూ.నాలుగు కోట్లు కానున్నట్లు అభ్యర్థులు మదనపడుతున్నారు. గత ఎన్నికల కంటే ప్రచార ఖర్చు నిమిత్తమే రూ.రెండు కోట్లుపైనే అదనంగా వెచ్చించాల్సి వస్తుందని నలిగిపోతున్నారు. ఈ ఖర్చు కాకుండా ఎన్నికల ముందు నగదు పంపిణీ, తాయిలాలకు అయ్యే ఖర్చుపై లెక్కలు వేసుకుంటూ అభ్యర్థులు అదిరిపడుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ ఓటర్లున్నారు. ఓటుకు రూ.వెయ్యి పంపిణీ చేస్తే రూ.20 కోట్లు, రూ.రెండు వేలు పంపిణీ చేస్తే రూ.40 కోట్లు అవుతుందని, తక్కువగా లెక్కించినా ప్రధాన పార్టీలకు చెందిన ఎంఎల్‌ఎ అభ్యర్థులు రూ.50 కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని గుబులు చెందుతున్నారు.

పంపిణీకి మరో ఖర్చు

గతంలో టిక్కెట్‌ ఆశించిన అభ్యర్థికి, ఇతర నాయకులకు సైతం భారీగా నజరానా ముట్టజెబితే తప్ప వెనక్కి తగ్గడం లేదని సమాచారం. దీంతో టిడిపి, జనసేనలోని అభ్యర్థులకు ఈ ఖర్చు మరింత అదనపు భారంగా మారినట్లు చర్చ నడుస్తోంది. అధికార పార్టీ వైసిపి గెలుపు కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైందనే ప్రచారం నడుస్తోంది. అభ్యర్థులకు ముందుగానే దీనిపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే చాలామంది అధికార పార్టీ అభ్యర్థులు మహిళలకు, వాలంటీర్లకు, డ్వాక్రా సిఎలకు ఇలా పలువురు ఉద్యోగులకు బహుమతుల పేరుతో భారీగా ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. నగదు పంపిణీ సైతం పెద్దఎత్తున సాగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్నదానికంటే ఈసారి ఎన్నికల్లో భారీగా ఖర్చవుతుందని అన్ని పార్టీల అభ్యర్థులూ లబోదిబోమంటున్నారు.