కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతున్న సొంత పార్టీ నేతలు..

కాంగ్రెస్ అంటే అవినీతి అని పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సూటుకేసుల్లో నోట్ల కట్టలతో దొరికే నేతలు ఎవరైనా ఉన్నారంటే వాళ్లు కాంగ్రెస్ నేతలేనని చెప్పాలి. అవినీతిని వ్యవస్థీకృతం చేసింది కూడా కాంగ్రెస్సేనని ఒప్పుకోవాలి. ముందు జాగ్రత్తగా ఇతరుల మీద అవినీతి ఆరోపణలు చేసి డిఫెన్స్ లో పడెయ్యాలని కాంగ్రెస్ వారు చూస్తుంటారు. వారి పాచికలు కొంతమేర పారినా..తర్వాత వాళ్లు అడ్డంగా బుక్కవుతారు. ఇప్పుడు కర్ణాటకలో జరిగింది కూడా అదే కావచ్చు.

శివరామూ ఆరోపణలతో ఖంగుతిన్న కాంగ్రెస్

బీజేపీ పాలనలో ప్రతీ పనికి 40 శాతం కమిషన్ తీసుకుంటున్నారని అవినీతి పెరిగిపోయిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. జనం నమ్మారో లేదో తెలీదు కానీ, కాంగ్రెస్ మాత్రం అధికారానికి వచ్చింది. ఇప్పుడు అలాంటి ఆరోపణలను కాంగ్రెస్ నేతలే చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోందని మాజీ మంత్రి బీ. శివరామూ ఆరోపించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తాను స్వయంగా ఈ విషయాన్ని చేరవేశానని శివరామూ వెల్లడించారు. ఒకప్పుడు తాను ప్రాతినిధ్యం వహించిన హసన్ జిల్లాలో అవినీతి కారణంగా ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకతా భావం పెరిగిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు..

కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ అసహనం

శివరామూ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఆయనకు మంచి సంబధాలున్నాయి. వారి మనోభావాలు ఆయనకు తొందరగా తెలుస్తాయి. కార్యకర్తల్లో సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ స్థాయిల్లో అవినీతి అంశం చర్చకు వచ్చింది. ఉన్నత స్థాయిలోనూ, అధికారవర్గాల్లోనూ అవినీతి భారీ స్థాయిలో పెరిగిపోయిందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. చిన్న కార్యాలయం నుంచి సీఎంఓ దాకా అవినీతిమయమయ్యాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. బీజేపీ పాలనలో 40 శాతం కమిషన్ తీసుకున్నారని ఆరోపించిన వాళ్లే..ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెక్కేస్తున్నారని సగటు కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పైగా అవినీతిని ప్రశ్నించిన వారిని కాంగ్రెస్ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు…

ఎదురుదాడికి ప్రయత్నిస్తున్న సీఎం, ఇతర నేతలు

ఎవరైనా అవినీతిపై ప్రశ్నిస్తే సీఎం సిద్దరామయ్య వారిపై కయ్యిమని ఎగురుతున్నారు. అవినీతి ఎక్కడ ఉందో చెప్పమంటూ ఎదురుదాడి చేస్తున్నారు. అవినీతి ఆరోపణలను నిరూపించాలని సవాలు చేస్తున్నారు. దీనికి బీజేపీ గట్టిగా సమాధానం చెబుతోంది. సొంత పార్టీ వాళ్లే ఆరోపణలు చేస్తున్నప్పుడు మళ్లీ ఇతరులు చెప్పాల్సిందేముందని కర్ణాటక బీజేపీ మాజీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కతీల్ నిలదీశారు. బదిలీలు సహా ప్రతీ పనికి ఒక రేటు విధించారని, క్యాష్ కొడితేనే పనులు జరుగుతాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారానికి వచ్చిన కొత్తల్లోనే ఒక కాంట్రాక్టర్ ఇంట్లో ఐటీ దాడులు జరిగితే రూ.100 కోట్లు క్యాష్ దొరికిందని ఆయన గుర్తు చేశారు.మరి దీనికి సిద్ధూ సమాధానమేమిటో…