భూములను స్వాహా చేసిన అవినీతి తిమింగలం…

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అవినీతికి మారుపేరుగా నిలిచారు. మైనింగ్ స్కామ్ కు సంబంధించి ప్రస్తుతం జైలులో ఉన్న ఆయనపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆయనో భూకబ్జాదారులు అని, అక్రమ సంపాదనలు నిలయమయ్యారని తాజా దర్యాప్తులో తేలింది. హేమంత్ లీలలు ఒకటొకటిగా బయటకు వస్తుంటే.. విస్తుపోవడం సభ్యసమాజం వంతయ్యింది.

ల్యాండ్ స్కాంలో ఈడీ ఛార్జ్ షీటు

హేమంత్ సోరెన్ ల్యాండ్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఛార్జ్ షీటు దాఖలు చేసింది. సోరెన్ ప్రధాన నిందితుడిగా ఉన్న కేసులో రూ. 600 కోట్ల ల్యాండ్ స్కాం జరిగినట్లు ఈడీ చెబుతోంది. హేమంత్ సోరెన్ తో పాటు రెవెన్యూ అధికారి భాను ప్రతాప్ ప్రసాద్ సహా మరో ఇద్దరు ప్రభుత్వోద్యోగులను నిందితులుగా చేర్చుతూ ఛార్జ్ షీటును కోర్టు ముందుంచింది. జార్ఖండ్ లాండ్ మాఫియాలో సోరెన్ ప్రధాన పాత్రధారి అని ఈడీ అంటోంది.

ప్రతాప్ కార్యాలయంలోనే ఫైలు

రెవెన్యూ అధికారి భాను ప్రతాప్ ప్రసాద్ కార్యాలయం నుంచి 44 పేజీలున్న ఫైలును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హేమంత్ సోరెన్ 8.86 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకుని తన పేరులో మార్చుకున్నట్లు ఛార్జ్ షీటులో ప్రస్తావించారు. ప్రతాప్ నిత్యం సోరెన్ ను బాస్ అని పిలుస్తారు. రాంచీలోని బర్గైన్ ప్రాంతంలో ఉండే ఆ స్థలం విలువ ఇప్పుడు రూ. 31 కోట్లు. 2011లో దాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్న సోరెన్ తర్వాత తన ఆస్తిగా మార్చుకున్నారు. ఆ స్థలాన్ని ఈడీ ఇప్పుడు జప్తు చేసింది.

సోరెన్ సన్నిహితులే సూత్రధారులు

స్కాం మొత్తం హేమంత్ సోరెన్ సన్నిహితుల చుట్టూ తిరుగుతోంది. అన్ని అవినీతికర చర్యలకు వాళ్లే సూత్రధారులుగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వోద్యోగులను పాత్రధారులుగా మార్చేశారు. సోరెన్ కు సన్నిహితులైన రంజిత్ సింగ్, హిలారస్ కచ్చప్ప, రాజ్ కుమార్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది..భూములను గుర్తించి వాటిని కబ్జా చేసేందుకు అవసరమైన దస్తావేజులు సృష్టించడంతో భాను ప్రతాప్ ప్రసాద్ కీలక భూమిక వహించారు. రాంచీలోని దాదాపు తొమ్మిది ఎకరాల భూములకు సంబంధించి ప్రతాప్ ప్రసాద్ ఆఘమేఘాల మీద రెండు సర్వేలు చేయించినట్లు కూడా ఈడీ విచారణలో వెల్లడైంది. ఆక్కడో భారీ భవనం నిర్మించేందుకు సోరెన్ ప్లాన్ చేసిన తరుణంలోనే స్కాం బయటపడటంతో విచారణ జరిగింది. నిందితుల డైరీలు, ఫోన్ సంభాషణల ఆధారంగా భాను ప్రతాప్ ప్రసాద్ చేసిన చట్టవ్యతిరేక చర్యలు బయటపడ్డాయి. మొత్తం 33 మంది సాక్షులను విచారించిన ఈడీ.. వేలాది పేజీల దస్తావేజులను స్వాధీనం చేసుకుంది. సోరెన్ నివాసంలో జరిగిన సోదాల్లో రూ. 36 లక్షల రూపాయల నగదు, ఒక బీఎండబ్ల్యూ కారు స్వాధీనమయ్యాయి….