కాంగ్రెస్ పార్టీని ఓ ఆటాడుకుంటున్న భాగస్వాముులు

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అత్యంత దీన స్థితిలోకి వెళ్లిపోతోంది. ఆ పార్టీకి పట్టుమని 50 సీట్లు కూడా రాకపోవచ్చని వరుస సర్వేలు చెబుతున్న తర్వాత కాంగ్రెస్ ను పరిగణించేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. బీజేపీ ఓ రేంజ్ లో ఎగతాళి చేస్తుంటే.. ఇండియా గ్రూపు భాగస్వాములు కాంగ్రెస్ ను వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నారు. నితీశ్ వెళ్లిపోయిన తర్వాత ఇండియా గ్రూపులో ఇతర భాగస్వాములు కాంగ్రెస్ ను పట్టించుకునేందుకు ఇష్టపడటం లేదు…

ఒక్క సీటు ఇస్తామంటున్న ఆప్…

కాంగ్రెస్ వెంపర్లాడుతోందా.. భాగస్వాములు దూరం పెట్టాలనుకుంటున్నారా..అంటే రెండు నిజమేననిపిస్తోంది. కాంగ్రెస్ ను ఇతరులు వద్దని అనుకుంటున్నా.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ మాత్రం జింక మార్కు బంక వేసినట్లుగా గట్టిగా పట్టుకుని వేలాడేందుకే ప్రయత్నిస్తోంది. మేము సీట్లు ఇవ్వలేమని ప్రకటించినా.. ఎన్నో కొన్ని ఇవ్వండి అంటూ బేరమాతోంది. దానితో విసుగు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు ఢిల్లీలో కొత్త గేమ్ కు తెరతీసింది. అక్కడి ఏడు లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ కు ఒక సీటు పడేస్తామని ఆప్ నేతలు ప్రకటించారు. ఆ పార్టీకి ఒక్క సీటు తీసుకునేందుకు కూడా అర్హత లేదని, ఐనా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఒకటంటే ఒకటి ఇస్తామని ఆప్ నేత సందీప్ పాఠక్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఆప్ కానీ, కాంగ్రెస్ కానీ ఢిల్లీలో ఒక్క లోక్ సభా స్థానాన్ని కూడా సాధించలేకపోయాయి. ఐనా సరే అక్కడ ఆప్ ప్రభుత్వంలో ఉన్నందున కాంగ్రెస్ ను పరిగణించే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు….

పంజాబ్ లో మొండిచేయి….

కాంగ్రెస్ పార్టీని పంజాబ్ లో ఆప్ బజారుకీడ్చింది. అక్కడ పార్టీకి ఎలాంటి బలం లేదని చెబుతూ అన్ని స్థానాల్లో తామే పోటీ చేస్తామని ప్రకటించేసింది. పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు.ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలను ఆప్‌ గెలుస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్ ఆప్ నేతలు ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావన చేయడం లేదు. అసలా పార్టీ ఉన్నదన్న సంగతిని గుర్తు చేసుకునేందుకు కూడా వాళ్లు ఇష్టపడటం లేదు…

పరువు తీసిన తృణమూల్…

బెంగాల్ వైపుకు రావద్దని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించినంత పనిచేశారు. బెంగాల్ లో 42 లోక్ సభా స్థానాలుంటే కాంగ్రెస్ కు ఒక్కటి కూడా ఇచ్చేది లేదన్నట్లుగా ఆమె మాట్లాడుతున్నారు. తొలుత కాంగ్రెస్ బలాలు, బలహీనతలు బేరీజు వేసి రెండు సీట్లు ఇస్తామని చెప్పిన దీదీ..ఇప్పుడు అదీ కూడా లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇదీ నిజంగా కాంగ్రెస్ కు చావుదెబ్బ అన్నట్లుగా చెబుతున్నారు…