తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఎదుర్కోనంత పెద్ద కష్టాన్ని ఇప్పుడు ఎదుర్కొంటోంది. గతంలో ఘోర పరాజయాలు ఎదురైనా.. ఒకటో, రెండో రాజ్యసభ సీట్లు వచ్చేవి. కానీ గత రెండు ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూా రాలేదు. దానికి తగ్గ ఎమ్మెల్యేల బలం లేదు. దీంతో టీడీపీకి ఉన్న ఒక్క రాజ్యసభ సభ్యుడి పదవి కాలం ముగిసిపోతోంది. కొత్త అభ్యర్థి ఎంపిక కాలేదు. దీంతో టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయినట్లయింది.
పెద్దల సభలో టీడీపీకి లేని ప్రాతినిధ్యం
టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ అంటే గత 41 ఏళ్లలో రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యులు లేకపోవడం ఇదే తొలిసారి అవుతుంది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 లోపు ఉండాలి. ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్య 245. ఇందులో 233 మందిని ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. మిగతా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఉమ్మడి రాష్ట్రం విభజన కారణంగా ఏపీకి రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11గా నిర్ణయించారు. రాజ్యసభలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీ 151 శాసనసభ స్థానాల్లో ఘనవిజయం సాధించగా.. టీడీపీ 23 స్థానాలకే పరిమితమయింది. ఓటమి తర్వాత సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌లు బీజేపీలో చేరారు. వారి పదవి కాలం కూడా పూర్తయిపోయింది.
టీడీపీ సభ్యుల పదవీ కాలం పూర్తి – వైసీపీ సభ్యులదే విజయం
రాజ్యసభకు ప్రతి రెండేళ్లకు ఓ సారి ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర కోటాలో ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో 2020లో నలుగురు టీడీపీ సభ్యులు, 2022లో ముగ్గురు టీడీపీ, ఒకరు వైఎస్సార్సీపీ పదవీకాలం పూర్తవడంతో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. నాడు అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఎనిమిది రాజ్యసభ స్థానాలు వైఎస్ఆర్సీపీకే దక్కాయి. తాజాగా ఏప్రిల్ 2 నాటికి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి , సీఎం రమేష్ , కనకమేడల రవీంద్రకుమార్ ల పదవీకాలం పూర్తికానుంది. వీటికి ఎన్నికలు పెట్టారు. మూడు స్థానాలకు మూడు నామినేషన్ల దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాజ్యసభకు ఎన్నికకు కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం శాసనసభలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే.. ఈ మూడు స్థానాలు వైసీపీకే చెందుతాయి. వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు ప్రచారం చేసుకున్నా ఎన్నికల్ల ోపోటీ చేయలేదు. దీంతో రాజ్యసభలో వైఎస్సార్సీపీ బలం 11కు చేరింది. టీడీపీకి రాజ్యసభలో ఏప్రిల్ తర్వాత ప్రాతినిధ్యం ఉండదు.
41ఏళ్లలో తొలి సారి !
ఒక్క రాజ్యసభ సభ్యుడు కూడా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇబ్బందికర విషయమే. ఎప్పుడూ లేని విధంగా రాజ్యసభలో ఒక్కరు కూడా ప్రాతినిధ్యం లేకపోవడం తలవంపులు తెచ్చిపెట్టేదిగా ఉండేదే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి ఇలాంటి అరుదైన అనుభవం ఎదురవుతుంది. రాజ్యసభలో స్థానాల కోసం పార్టీకి కావాల్సిన అర్హత వంటి టెక్నీకల్ అంశాలను పక్కన పెడితే ఈ పరిణామం చాలా వరకూ టీడీపీ శ్రేణుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే అంశం అనుకోవచ్చు. కేంద్రంలో చక్రం తిప్పి దేశ ప్రధానిని సైతం నిర్ణయించిన చంద్రబాబు అధ్యక్షతన నడుస్తున్న పార్టీకి ఈ గతి పట్టడం టీడీపీ కార్యకర్తల్ని నిరాశకు గురి చేస్తోంది.