రైతుల కోసం పనిచేసే మోదీ సర్కార్….

పంజాబ్ రైతులు కేంద్రప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు.ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా అవి చాలవన్నట్లుగా వాళ్లు ఇంకా డిమాండ్ చేస్తూనే ఉన్నారు ప్రధాన డిమాండ్లను నెరవేర్చిన తర్వాత కూడా ఆచరణ సాధ్యం కాని వాటి కోసం వాళ్లు ప్రయత్నిస్తూ చర్చలు విఫలమైనట్లు ప్రకటించేశారు. ఇప్పుడు మళ్లీ చలో ఢిల్లీ అంటున్నారు. అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం చేసిందేమిటో ఓ సారి చూద్దాం….

వ్యవసాయ బడ్జెట్ పెంపు…

పదేళ్ల పాలనా కాలంలో నరేంద్రమోదీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. 2013 -14తో పోల్చితే.. 2023-24 నాటికి బడ్జెట్ కేటాయింపులు 5.26 రెట్లు పెరిగాయి.అన్నదాతలకు ప్రభుత్వం నుంచి సమగ్రంగా సహకారం అందాలన్న తపన ప్రభుత్వంలో కనిపించింది. వ్యవసాయానికి, టెక్నాలజీ జోడించే ప్రోత్సాహకాలు మోదీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమయ్యాయి.

తిరుగులేని పీఎం కిసాన్ , మద్దతు ధర

పిఎం కిసాన్ ఒక చరిత్మాత్మక పథకంగా పరిగణించాల్సి ఉంటుంది. 2018 డిసెంబరు నుంచి ప్రతీ ఏటా రైతుల ఖాతాలో రూ.6 వేలు జమ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు రూ.2.81 లక్షల కోట్లు పంపిణీ చేశారు. చిన్నకారు రైతులను ప్రోత్సహించే దిశగా వ్యవసాయోత్పత్తుల విక్రయ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. మౌలిక సదుపాయాల నిధిని కూడా ప్రారంభించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అందే విధంగా చర్యలు తీసుకుంటూ రైతులను కాపాడుతున్నారు. ఈ విషయంలో రైతుల అపోహలను పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పంటను నష్టానికి తెగనమ్ముకోకుండా చూస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఎంఎస్పీ ఫార్ములా తమకు అనుకూలంగా లేదని రైతులు భావించడం పొరబాటే అవుతుందని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. దాని వల్ల పంట అమ్ముడుపోవడం నిజమే కానీ, లాభం రావడం లేదని రైతు సంఘాల సమాఖ్య ఆరోపించింది. అందుకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇస్తోంది. ఖరీఫ్, రబీతో పాటు వాణిజ్య పంటలను 2018-19 లెక్కల ఆధారంగా పరిగణిస్తున్నామని, ఉత్పత్తి వ్యయంపై 50 శాతం ఎక్కువ చేతికి వచ్చేట్టుగా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది…

రైతులకు వరప్రసాదం కిసాన్ క్రెడిట్ కార్డ్

రైతుల నుంచి పంటల సేకరణను బాగా పెంచేశారు. దీని వల్ల అన్నదాతల దగ్గర పంట నిల్వ ఉండకుండా గోదాములకు చేరుతోంది. పెట్టుబడి సమస్య రాకుండా ఉండేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమును సమర్థంగా నిర్వహిస్తున్నారు. 2022-23లో కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాలిచ్చేందుకు రూ.20 లక్షల కోట్లు కేటాయించారు. దీన్ని పశుసంవర్థక విభాగానికి కూడా విస్తరించారు. చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. దీనికోసం పరిశోధనలు జరుపుతున్నారు. రైతులు పంటలను తగులబెట్టి పర్యావరణ కాలుష్యానికి కారణం కాకుండా ఉండే చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియలో యాంత్రీకరణ కోసం రూ. 3,138.56 కోట్లు కేటాయించారు. ఇప్పటికైనా రైతులు అర్థం చేసుకుని చర్చలకు వస్తే బావుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది..