రాష్ట్రంలో అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ఇప్పటికీ తమ ప్రధాన కార్యలయాలను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్‌లో వెల్లడయింది. రాష్ట్ర పార్టీల వివరాలతో కూడిన జాబితాలను ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. ఈ గెజిట్‌లో ఆయా పార్టీల వివరాలు, గుర్తు, ప్రధాన కార్యాలయాల చిరునామాలు ఉంటాయి.
హైదరాబాద్‌లోనే టీడీపీ మెయిన్ ఆఫీస్
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంగా ఎన్‌టిఆర్ భవన్, రోడ్ నెంబరు-2, బంజారాహిల్స్, హైదరాబాద్ 500033 (తెలంగాణ) అని పేర్కొన్నారు. అలాగే అధికార వైసిపి ప్రధాన కార్యాలయంగా హౌస్ నెంబరు 8-2-269/ఎస్/98, సాగర్ సొసైటీ, రోడ్ నెంబరు-2, బంజారాహిల్స్, హైదరాబాద్-500034, (తెలంగాణ)గా వెల్లడించారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడకు మకాం మార్చిన ఆ పార్టీ అధినేత, నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు. 2019 తరువాత అక్కడ నుండి కార్యకలాపాలు మొదలుపెట్టారు. వీటిల్లో వైసిపికి శాశ్వత కార్యాలయం లేకపోయినా టిడిపి మాత్రం శాశ్వత ప్రాతిపదికన కార్యాలయం నిర్మించుకుంది. అయితే ఇరు పార్టీలు కూడా తమ పార్టీ కార్యాలయాల చిరునామాలు మార్చుకోలేదు.
తెలంగాణలో పోటీ చేయని పార్టీలు
2014లో రాష్ట్రం విడిపోయిన తరువాత 2018 వరకు వైఎస్‌ఆర్‌సిపి హైదరాబాద్ నుండే కార్యకలాపాలు నిర్వహించింది. అనంతరం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆ పార్టీ అధినేత, నాటి ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయాన్ని కూడా తొలుత విజయవాడకు, అనంతరం తాడేపల్లికి మార్చారు. ప్రస్తుతం తాడేపల్లిలోనే ప్రధానకార్యాలయం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ టిడిపి, వైసిపి పోటీ చేసింది లేదు. అయినా ఈ రెండు పార్టీలు వాటి అడ్రస్‌లను తెలంగాణాలోనే ఉంచాయి. ఎన్నికల సంఘం నుంచి కీలకమైన ఉత్తర, ప్రత్యుత్తరాలన్నీ ప్రధాన కార్యాలయాల చిరునామాలతోనే నిర్వహించాల్సివుంటుంది.
మంగళగరిలోనే జనసేన పార్టీ అడ్రస్
గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలను ఆంగ్ల అక్షర క్రమంలో పేర్కొనగా..1217వ స్థానంలో జనసేన గురించి వెల్లడించారు. ఆ పార్టీ కార్యాలయం మంగళగిరిలోని లక్ష్మీనరసింహ కాలనీ చిరునామాలో ఉంది. అంటే జనసేన మాత్రం ఏపీ నుంచే నడుస్తోంది. రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీగా ఉన్న జనసేన తొలుత ప్రశాసన్‌నగర్ నుండి కార్యాలయం నిర్వహించినా అనంతరం మంగళగిరి సమీపంలో కార్యాలయం నిర్మించుకొని ప్రస్తుతం అక్కడ నుండే తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత ఎన్నికల సంఘం గెజిట్‌లోనూ జనసేన ఇదే చిరునామాను పొందుపర్చింది.