కాంగ్రెస్ నేతృత్వ యూపీఎ దేశాన్ని ఎలా అథోగతిపాలు చేసిందో అన్ని విషయాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. చేయగలిగి కూడా చేయలేని దీన స్థితిలో అప్పటి ప్రభుత్వం ఉందనేందుకు దుష్టాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుత కేంద్ర మంత్రులు ఒకటొకటిగా చెబుతుంటే విస్తుపోయే నిజాలు వెలికి వస్తున్నాయి. చివరకు దేశ భద్రత, రక్షణ విషయంలో కూడా వాళ్లు రాజీపడిన తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది..
ముంబై ఉగ్రదాడిలో ఉదాసీనత
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉండేదీ అప్పటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) ప్రభుత్వ తీరు. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల ( ట్వంటి సిక్స్ బై ఎలెవెన్) పట్ల వాళ్లు తీవ్ర నిరాసక్తతను కనబరిచారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులో దాడులు చేసి వందల మందని పొట్టన పెట్టుకున్నారని, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రోద్బలంతోనే అక్కడ కూర్చున్న సూత్రధారులో ఆ పని చేశారని తెలిసి కూడా ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగలేదని అప్పట్లో చక్రం తిప్పిన వాళ్లే అంగీకరించారు.
పాకిస్థాన్ కు భయపడిన యూపీఏ
భారత విదేశాంగ నీతిని.. ఒక భయంతో కూడిన వ్యవస్థగా మార్చిన ఘనత యూపీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. పాకిస్థాన్ దాడి చేయకుండా ఉండే కంటే దాడి చేస్తే అధిక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని 2008 నాటి పాలకులు భయపడినట్లు ప్రస్తుత భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ విశ్లేషించారు. ప్రపంచ దేశాలు దిశానిర్దేశం కోసం మన వైపు చూస్తున్న తరుణంలో యూపీఏ ప్రభుత్వం భయపడి చేతులు ముడుచుకు కూర్చున్నదని కూడా ఆయన ఆరోపించారు. గ్లోబల్ సౌత్ లో 125 దేశాలను దివిటీ పట్టుకుని నడిపించాల్సిన తరుణంలో ఆ పని మాసేసి పాకిస్థాన్ కు భయపడుతూ బతికారని ఆయన అన్నారు. అప్పటి జాతీయ భద్రతా సలహాదారు రాసిన పుస్తకంలో కూడా అదే అంశాన్ని ఒప్పుకున్నారని జై శంకర్ గుర్తుచేశారు. చర్చించి, పూర్వాపరాలు బేరీజు వేసి పాకిస్థాన్ పై ఎలాంటి దాడి చేయకూడదని అప్పట్లో జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన శివశంకర్ మీనన్ రాసిన ఒక పుస్తకంలోని అంశాలను జై శంకర్ ప్రస్తావించారు..
యూపీఏకు ఎన్డీయేకు తేడా అదే..
యూపీఏ పాలనా కాలంలో భయపడుతూ బతికితే మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మాత్రం దూకుడును ప్రదర్శించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై మన ఆర్మీ దాడులు జరిపి ముష్కర మూకలను మట్టుబెట్టింది. ఐనా సరే పాకిస్థాన్ చేయగలిగిందేముంది. ఆ తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై కూడా మన సైన్యం దాడులు చేసింది. అప్పుడు కూడా పాక్ పాలకులు కుక్కిన పీనల్లా పడున్నారు. అదే పని యూపీఏ పాలనలో జరిగి ఉంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అప్పుడే దారికి వచ్చేవారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..