నిత్యం పంచాంగం ఫాలో అయ్యేవారు..ఏ పని చేయాలన్నా తిథి, వారం, నక్షత్రం, అమృత ఘడియలు, రాహుకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం, యమగండం చూసుకుంటారు. అయితే తిధి, వారం, నక్షత్రం బావుంటే అమృత ఘడియల్లో ఏ కార్యం చేసినా సక్సెస్ అవుతుందని నమ్ముతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం, యమగండం సమయంలో ఏ పనీ తలపెట్టరు. అయితే…ఈ ఆలయంలో మాత్రం రాహుకాలం చాలా ప్రత్యేకం. ఆ సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి.
శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవి అవతారాల్లో ఒకటి బనశంకరీదేవి. ఈమేనే వనశంకరిగానూ, శాకంబరిగానూ పిలుస్తారు. బెంగళూరులోని కనకపుర రోడ్డులో కొలువుదీరి పూజలందుకుంటోంది. ఈ అమ్మవారిని నిత్యం రాహుకాలంలో పూజిస్తే సమస్యలు తొలగిపోయి సకలశుభాలూ కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే… రాహుకాలంలో నిర్వహించే పూజల్లో పాల్గొనేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తారు. దేశవిదేశాల నుంచి ఎంతోమంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయం నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. మన దేశంలో బిజాపూర్ బాదామిలో బనశంకరి దేవి ఆలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. బెంగళూరుకు చెందిన సోమన్న శెట్టి అనే అమ్మవారి భక్తుడు అప్పుడప్పుడూ ఆ ఆలయానికి వెళ్లొచ్చేవాడట. అలా ఆ 1915లో అక్కడినుంచి దేవి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడని స్థలపురాణం.
సింహ వాహినిగా దర్శనమిచ్చే అమ్మవారు
విశాలమైన ప్రాంగణంలో కనిపించే బనశంకరి ఆలయంలో అమ్మవారు సింహవాహినిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారికి ఇతర ఆలయాల లానే రోజూ అభిషేకాలూ, ఇతర పూజలూ చేయడం మామూలే. అయితే… వాటన్నింటికన్నా ఇక్కడ రాహుకాలంలో చేసే పూజల్లో పాల్గొనేందుకే భక్తులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. రాహుకాల సమయంలో బనశంకరిని దర్శించుకుని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయనీ, కోరిన కోర్కెలు నెరవేరతాయనీ భక్తుల నమ్మకం. అందుకే రాహుకాలంలో భక్తులు ఆలయానికి వచ్చి నిమ్మకాయల డొప్పలతో చేసిన దీపాలను ఐదు, ఏడు, తొమ్మిది చొప్పున వెలిగిస్తారు.
మంగళవారం, శుక్రవారం, ఆదివారాల్లోనూ దేవిని దర్శించుకునేందుకూ ప్రాధాన్యం ఇస్తారు. భక్తులు తీసుకొచ్చే కూరగాయలతో శాఖాంబరిగా అలంకరిస్తారు. ఏటా పుష్యమాసంలో ఈ ఆలయంలో జరిగే జాతర చూసేందుకు కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. దసరా, ధనుర్మాసం సమయంలోనూ అమ్మవారికి ప్రత్యేక పూజలూ జరిపిస్తారు.
గమనిక: పుస్తకాల నుంచి ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..