కుక్కలు కూడా ఒంటరితనం ఫీలవుతాయని మీకు తెలుసా!

లోన్లీగా అనిపిస్తోంది అనే మాట ఎవరో ఒకరి నుంచి వినే ఉంటాం. మనకే చాలాసార్లు అలా అనిపిస్తుంది. చుట్టూ అందరూ ఉంటారు, కావాల్సినవన్నీ ఉంటాయి కానీ ఏదో లోన్లీగా అనిపిస్తుంది. అయితే ఈ భావన కేవలం మనుషులకే కాదు..కుక్కలకు కూడా ఉంటాయట. అదెలా తెలుసుకోవాలో వివరిస్తూ కొన్ని సూచనలు చేశారు నిపుణులు…

పెంపుడు కుక్కలు మహా సున్నితంగా ఉంటాయట. సంతోషంగా అనిపించినా, బాధ కలిగినా వెంటనే వ్యక్తం చేసేస్తుంటాయి. యజమాని దగ్గరికి తీసుకోకపోయినా ఒత్తిడికి గురవుతాయని… ప్రపంచవ్యాప్తంగా 23 నుంచి 55 శాతం పెంపుడు కుక్కలు ఒంటరితనంతో బాధపడుతున్నట్టు గుర్తించారు నిపుణులు. వృత్తి ఉద్యోగాలు, వ్యాపార వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు.. ఇలా రకరకాల కారణాలతో యజమానులు తమను నిర్లక్ష్యం చేసినప్పుడు పెంపుడు జంతువులలో ఒంటరి భావన మొదలవుతుంది. వాటి ప్రవర్తనలో ప్రతికూలమైన మార్పులు కనిపిస్తాయి.

ఈ మార్పులు కనిపిస్తే అవి లోన్లీగా ఫీలవుతున్నట్టు
ఏమీ లేకపోయినా ఊరికే ఇల్లంతా అరుస్తూ తిరుగుతుంటాయి, తలుపులు గోడలపై కాళ్లతో గీకుతుంటాయి
క్షమశిక్షణ పక్కనపెట్టేసి ఇంట్లోనే మూత్ర విసర్జన చేస్తాయి..
ఆహారాన్ని నమిలే పద్ధతుల్లో వ్యత్యాసం కనిపిస్తుంది…నిత్యం రిలాక్స్ గా తినే శునకాలు లోన్లీగా ఫీలవుతున్నప్పుడు దూకుడుగా తింటాయట
ఒక్కోసారి రోజంతా ఏమీ ముట్టుకోకుండా ఉపవాసం ఉంటాయి
యజమాని బయటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నప్పుడు తన వెంట వెళ్లేందుకు ఆరాటపడతాయి

ఏం చేయాలి మరి!
ఒంటరితనం కారణంగా దిగులుగా ఉన్న పెంపుడు జంతువుల్ని ఆ మానసిక స్థితి నుంచి బయటపడేయాలంటే ఒకటే మార్గం. మొదట వాటిని ప్రశాంత వాతావరణంలోకి తీసుకెళ్లి ఇతర పెంపుడు జంతువుల మధ్య విడిచిపెట్టాలి. వాటికి తోడుగా మరో కుక్కను పెంచుకున్నా పరిస్థితిలో మార్పు వస్తుంది. ఇంట్లో అవి స్వేచ్ఛగా తిరిగే ఏర్పాట్లు చేయాలి. యజమాని బయటకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు వాటితో కాసేపు స్పెండ్ చేసి… ఆ టైమ్ ని అలవాటు చేయాలి..క్రమంగా ఆ టైమ్ పెంచుకుంటూ వెళ్లాలి. అన్ని పెంపుడు జంతువుల విషయంలో ఇవే సూత్రాలు వర్తిస్తాయని చెప్పలేం…మీరు మొదట్నుంచీ వాటిని ఎలా ట్రీట్ చేశారో దాన్నిబట్టి మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా సంగీతం పెట్స్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తరచూ వాటికి మ్యూజిక్‌ వినిపించవచ్చు.