టీ షాపు కార్మికుడిచ్చిన రూ.1,368 కోట్ల విరాళం…

సుప్రీం కోర్టు చెప్పిన ఒక తీర్పు అనేక నిగూఢ రహస్యాలను ఆవిష్కరించింది. దేశంలోని రాజకీయ పార్టీలకు ఎవరెవరి నుంచి నిధులు వచ్చాయో నిగ్గుతేల్చే అవకాశం వచ్చింది. అందులో నిజాయతీగా, చట్ట ప్రకారం వ్యాపారం చేసి సంపాదించిన సొమ్ములో నిధులిచ్చిన వాళ్లు కొందరైతే, లాటరీలు, అక్రమ సంపాదనతో ధనరాసులను పోగేసి అందులో కొంచెం పార్టీలను విదిలించిన వాళ్లూ ఉన్నారు. అలాంటి వారిలోనే తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన శాంటియాగో మార్టిన్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది…

బర్మా కాందిశీకుడే మల్టీ మిలియనీర్

ఫ్యూచర్ గేమింగ్ ప్రైవేటు లిమిటెడ్ అనే లాటరీ కంపెనీని ప్రారంభించిన శాంటియాగో మార్టిన్ రూ.1,368 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనుగోలు చేసి పార్టీలకు విరాళంగా ఇచ్చారు. కోయంబత్తూరులో అతనికి లాటరీ కింగ్ అన్న పేరు ఉంది.అండమాన్లో పుట్టిన మార్టిన్ తొలుత బర్మా (మియన్మార్)లో దినసరి కూలీగా పనిచేసేవారు. అక్కడ ఉండలేక తమిళనాడుకు వచ్చేశారు.కోయంబత్తూరులో తన సోదరి దగ్గరకు చేరి టీ షాపులో పనిచేయడం ప్రారంభించారు. అప్పట్లో తమిళ జనానికి లాటరీ పిచ్చి ఎక్కువగా ఉండేది. దానితో మార్టిన్ లాటరీ టికెట్ల వ్యాపారం ప్రారంభించి భారీగా ఆదాయం పొందారు. విక్రయాలు పెరగడమే కాకుండా అమ్ముడు పోకుండా ఉన్న లాటరీ టికెట్లకు వచ్చిన ప్రైజ్ మనీతో ఆయన లాభాలు బాగా పెరిగాయి. 1987లో లీమా రోస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కోయంబత్తూరులో ఐదు లాటరీ షాపులు తెరిచారు. ఏడాదిలోనే సొంతంగా లాటరీ టికెట్ల ముద్రణ ప్రారంభించారు. ఇదీ భారీ లాటరీ వ్యాపారానికి వేదికైంది.

తెలివిగా ఇతర రాష్ట్రాల్లోకి ఎంట్రీ..

మార్టిన్ వ్యాపారంలో పోటీదారులందరినీ దాటి పోయారు. 1990ల్లో అతనికి తిరుగులేదు. 2003లో అప్పటి సీఎం జయలలిత లాటరీలను నిషేధించారు. దానితో తమిళనాట టికెట్ల విక్రయం ఆగిపోయినా… మార్టిన్ మాత్రం కర్ణాటక, కేరళ, ఈశాన్యం, చివరకు భూటాన్లోకి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అప్పట్లో అతను డీఎంకేకు చాలా దగ్గర వాడని పేరుండేది. అందుకే జయలలిత లాటరీలను నిషేధించారని చెబుతుండేవారు. కరుణానిధికి మాత్రమే కాకుండా కేరళలో సీపీఎంకు ఆయన దగ్గరయ్యారు. కేరళలో సీపీఎం పత్రిక దేశాభిమానికి రూ.2 కోట్లు విరాళం ఇవ్వడం 2008 ప్రాంతంలో వివాదమైంది. సిక్కిం ప్రభుత్వాన్ని మోసగించారని, ఈశాన్య రాష్ట్రాల్లో పలువురు రాజకీయ నాయకులకు డబ్బు మూటలు పంపారని మార్టిన్ మీద ఆరోపణలున్నాయి. ఒక్క సిక్కింలోనే అతను రూ. 910 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఈడీ కేసు పెట్టింది. అప్పాయింట్ మెంట్ లేకుండా ముఖ్యమంత్రులను కలిసే సమర్థుడాయన. మార్టిన్ ఒక సినిమా తీసి నష్టపోయినా కరుణానిధికి మాత్రం బాగా దగ్గరయ్యారు. జయలలిత హయాంలో 2011లో అరెస్టు చేయగా… తమిళనాడు ప్రభుత్వం ఆయనపై లాటరీలు, భూ కబ్జాలకు సంబంధించి 14 కేసులు పెట్టింది. ఎనిమిది నెలల తర్వాత ఆయన విడుదలయ్యారు..

స్టాలిన్ పార్టీకి రూ. 509 కోట్ల విరాళం…

పార్టీలకు విరాళాలివ్వడంతో మార్టిన్ నెంబర్ వన్. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డీఎంకేకు రూ. 656 కోట్ల రూపాయలు విరాళం వస్తే.. అందులో రూ. 509 కోట్లు మార్టిన్ కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ నుంచి అందింది. డీఎంకేకు తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా ఇంజనీరింగ్ నుంచి కూడా రూ. 105 కోట్ల రూపాయలు అందింది. అయితే మార్టిన్ ఇచ్చిన విరాళం డీఎంకే నేతలతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని కూడా బయట పెట్టింది. పైగా మార్టిన్ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉండటం కూడా కలిసొచ్చే అంశం.