బిహార్ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. నితీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఈ సారి కూటమి మారింది. బీజేపీ వచ్చి ఆయనతో చేతులు కలిపింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు బిహార్లో కూడా పీఠంపై కూర్చోవడం ద్వారా డబుల్ ఇంజన్ సర్కారుకు మరోసారి తెరలేపిందని చెప్పాలి. ఈ అధికార మార్పిడిలో ఒకటి రెండు కీలకాంశాలున్నాయని కూడా చెప్పక తప్పదు…
అందరి చూపు సామ్రాట్ చౌదరి వైపే….
బీజేపీలో రైజింగ్ స్టార్ గా పేరుపొందిన 55 ఏళ్ల సామ్రాట్ చౌదరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వడం వెనుక బీజేపీ దీర్ఘాకాలిక వ్యూహం ఉందనే చెప్పక తప్పదు. ఆయన కూడా ముఖ్యమంత్రి నితీశ్ లాగే ఓబీసీ సామాజికవర్గం నాయకుడు. నితీశ్ కుమార్ కంటే 20 ఏళ్లు చిన్నవాడైన సామ్రాట్ చౌదరి..ప్రస్తుతం ముఖ్యమంత్రికి పోటీ ఇవ్వగల నాయకుడని చెబుతున్నారు.
బిహార్లో బీజేపీకి నాయకుడు….
సామ్రాట్ చౌదరి ఎలివేషన్ అనేక ప్రశ్నలకు సమాధానం చెబుతుందనుకోవాలి.ఆ రాష్ట్రంలో పార్టీకి ఆయనే తిరుగులేని నాయకుడని అధిష్టానం పరోక్షంగా చెప్పేసిందని, ఇక అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని చెబుతున్నారు. ఇంతవరకు బిహార్ బీజేపీ అంటే సుశీల్ మోదీ పేరు వినిపించేదు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు. ఇప్పుడు బీజేపీ ఆలోచన మారింది. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలనుకుంది. 2025 ఎన్నికల నాటికి సామ్రాట్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని పార్టీ భావిస్తోంది. ఆ దిశగా ఆయనకు సంకేతాలు కూడా అందాయని అంటున్నారు. సామ్రాట్ చౌదరి తొలుత ఆర్జేడీ, జేడీయూలో ఉండేవారు. తర్వాత బీజేపీ వైపుకు వచ్చారు. 1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి 1999లో వ్యవసాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2010లో పార్టీ చీఫ్ విప్ గా ఉండేవారు. 2014లో పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా పనిచేశారు. 201లో బిహార్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. 2020లో బిహార్ బీజేపీ స్థార్ క్యాంపైనర్ గా నియమితులయ్యారు. 2021లో పంచాయతీ రాజ్ మంత్రి అయ్యారు. 2023లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడయ్యారు.బిహార్ బీజేపీలో సామ్రాట్ చౌదరికి ఫైర్ బ్రాండ్ అన్న పేరు ఉంది.ఎవరికీ భయపడకుండా, ఎవరినైనా నిలదీసే దమ్మున్న నాయకుడిగా ముద్రపడింది. పైగా బలమైన కొయిరీ ఓబీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు ఆయన…
నితీశ్ దిగిపోవాల్సిందేనా…
ప్రభుత్వం మారే క్రమంలో బీజేపీ, జేడీయూ మధ్య కీలకాంశాలు చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత నితీశ్ దిగిపోయి బీజేపీకి సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. అందులో నిజమెంతో నితీశ్ అయినా చెప్పాలి… బీజేపీ అగ్రనేతలైనా వెల్లడించాలి…