ఏపీ , ఒరిస్సాల్లో బీఆర్ఎస్ బ్రాంచ్‌లు దివాలా – నేతలంతా జంప్ !

భారత రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీ పెట్టి.. . చివరికి గల్లీకి పరిమితమయ్యారు కేసీఆర్. ఇప్పుడు ఆయన పెట్టుకున్న బ్రాంచీలు కూడా మూతపడుతున్నాయి. పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత ఏపీ, ఒరిస్సాలకు అధ్యక్షుల్ని నియమించారు. ఇప్పుడు వారు ఇతర పార్టీల్లో చేరిపోయారు. దీంతో ఆయా బ్రాంచులు మూతబడినట్లయింది.

ఏపీలో బీఆర్ఎస్ కండువాలు ఎప్పుడో పక్కన పడేసిన నేతలు

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత కేసీఆర్ ఏపీపై ఫోకస్ పెట్టారు. స్టేట్ బీఆర్ఎస్ కమిటీని కూడా ప్రకటించారు. తెలంగాణ భవన్ కన్నా ఏపీలో బీఆర్ఎస్ భవన్ రద్దీగా మారుతుందని ప్రకటించారు. తీరా చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ దివాలా తీసినట్లయింది. మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ని ఏపీ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తే ఆయన పత్తా లేకుండా పోయారు. బీఆర్ఎస్‌లో తోట చేరిక సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హోర్డింగులతో హడావుడి చేశారు. తనతో పాటు ఇంకొందరు నేతల చేరిక కోసం హైదరాబాద్ నుంచి వాహనాలు పంపి మరీ రప్పించుకున్నారు. దారి పొడవునా బీఆర్ఎస్‌లోకి స్వాగతం అంటూ హోర్డింగులు, ఫ్లెక్సీలూ ఏర్పాటు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహిస్తుందనీ, కేసీఆర్ ఆ సభలలో పాల్గొంటారనీ పెద్ద ఎత్తున ప్రచారంతో ఊదరగొట్టేశారు. తీరా చూస్తే ఇప్పుడు తోట చంద్రశేఖర్ జనసేనలోకి మళ్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక బీఆర్ఎస్ ఉండదని ఆ పార్టీలో చేరిన నేతల భావన

ఇంట గెలవలేని పార్టీ రచ్చకెక్కి మాత్రం ఏం చేయగలుగుతుందిలే.. అని ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్న ఏపీ బీఆర్ఎస్‌లో ఉన్న ఒకటి అరా నేతలు.. పక్క చూపులు చూస్తున్నారంట.. బీఆర్ఎస్ ముఖ్యులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టే పరిస్థితి కనిపించపోతుండటంతో.. రాష్ట్రంలో ఆ పార్టీకి నేతలే కాదు కనీసం జెండా పట్టుకునే కార్యకర్తలు కూడా కనిపించకుండా పోతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌కు రియల్ ఎస్టేట్ సహా అన్ని వ్యాపారాలు హైదరాబాద్‌తోనే ముడిపడి ఉన్నాయి. బీఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో.. తన ఆస్తులకు ఢోకా లేకుండా చేసుకోవడానికే ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఇప్పుడు తెలంగాణలోనే బీఆర్ఎస్ పరాజయం పాలు కావడంతో.. ఆయన కారు దిగడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఆయన జనసేనతో టచ్‌లోకి వెళ్లారంట.. టీడీపీ, జనసేనల పొత్తు ఖాయమవ్వడంతో ఈ సారి ఎక్కడైనా సీటు దక్కించుకుని గెలవాలని ఆశపడుతున్నారంట. మరో నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు .. ఆయన హైదరాబాద్ వెళ్లి గులాబీకండువా కప్పుకున్న తర్వాత ఒకటిరెండు రోజులు కాస్తంత హడావుడి చేశారు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడటం కాదుకదా.. అసలు కనిపించడమే మానేశారు.. పరిస్థితి లేదు.. ప్రస్తుతం ఆయన కూడా వైసీపీ తలుపులు తడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది..

వేరే పార్టీలో చేరిపోయిన ఒడిషా చీఫ్ గమాంగ్

ఒడిషా బీఆర్ఎస్ చీఫ్ గా ఉన్న గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ తన అనుచరులతో కలిసి రాజీనామాలు చేసేశారు. ఒడిషాలో భారీగా పార్టీ ఆఫీసు ప్రారంభిస్తామని బహిరంగ సభ కూడా ఏర్పాటు చే్స్తామని కేసీఆర్ చెప్పారు. పార్టీ ఆఫీసు కోసం వెదికే పని అప్పట్లోనే పార్టీలో చేరిన రావెలకిషోర్ కు అప్పగించారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. రావెల కిషోర్ కూడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల కోసం నిధులు సర్దుబాటు చేయడానికి కూడా కేసీఆర్ ఆసక్తి చూపించకపోవడంతో గిరిధర్ గమాంగ్‌తో పాటు ఇతర నేతలు .. ఇక పార్టీ మరిపోవడం మంచిదని నిర్ణయించుకుని తమ మాతృపార్టీ కాంగ్రెస్ లో చేరిపోయారు. గమాంగ్ కుటుంబం.. సంప్రదాయంగా కాంగ్రెస్ కు చెందిన వారు. ఎంపీగా గిరిధర్ గమాంగ్ రికార్డు స్థాయిలో విజయం సాధించారు.