ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది ఎక్కడోనని తేలిపోయింది. ఎప్పటికప్పుడు కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న ఆప్ నేతలు ఎక్కువ కాలం ప్రజలను మోసగించలేరని కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఆప్ నేతలు ఒక్కొక్కరుగా అరెస్టు అవుతుంటే చేసిన తప్పులకు మరికొంతమంది అరెస్టు కావడం ఖాయమని కూడా స్పష్టమవుతోంది. అక్రమాలు బయటకు వచ్చే కొద్దీ పార్టీ నుంచి పలాయనం చిత్తగించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. పార్టీ నేతలు, మంత్రులు గుడ్ బై చెప్పేస్తున్నారు…
పార్టీకి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా..
రాష్ట్రమంత్రిగా ఉన్న ఒక నేత అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఆయన పేరు రాజ్ కుమార్ ఆనంద్. పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తూ మరీ ఆయన తన రాజీనామాను ప్రకటించారు. అవినీతి వ్యతిరేకోద్యమం నుంచి వచ్చిన పార్టీగా పేరు పొందడంతో ఆప్ లో చేరామని ఇప్పుడు ఎటు చూసినా అవినీతి కనిపిస్తోందని ఆయన ఆరోపణలు సంధించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. రాజకీయాలు మారితే దేశం మారుతుందని కేజ్రీవాల్ అన్నారని దాన్ని నమ్మి తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న రాజ్ కుమార్ ఆనంద్ ఇప్పుడు పరిస్థితులు చూస్తే మాత్రం ఆప్ లో పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఆప్ ఒక అవినీతి పుట్టగా మారిందన్నారు..
మరికొన్ని అరెస్టులు తప్పవా..?
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆప్ పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది. ఆయన్ను ఈడీ ప్రశ్నించి ఎటువంటి సమాచారం రాబట్టిందో అర్థం కాక ఆప్ నేతలు నానా తంటాలు పడుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టు రోజున, ఆ తర్వాత కొన్ని రోజులు బీజేపీని తిట్టి పోస్తూ హడావుడి చేసిన మంత్రి అతిషీ ఇప్పుడు కిక్కురుమనడం లేదు. లో ప్రొఫైల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.మరో నలుగురు ఆప్ నేతలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోందని తెలియడంతో ఆమె మౌనం వహిస్తున్నట్లు చెబుతున్నారు. లిక్కర్ స్కాంకు సంబంధించి అన్ని వ్యవహారాలు చూసిన వ్యక్తులు అతిషితో టచ్ లో ఉన్నారని కేజ్రీవాల్ వెల్లడించినట్లుగా ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దానితో ఆమెకు భయం పట్టుకున్నట్లుగా చెబుతున్నారు.
కేజ్రీవాల్ కు లభించని ఊరట
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్‌ను వచ్చే సోమవారం పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్‌కు తెలిపారు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ మార్చి 21న కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, తన లాయర్లను కలిసేందుకు వారానికి ఐదుసార్లు అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇప్పుడున్న ప్రకారం వారానికి రెండు సార్లు మాత్రమే కేజ్రీవాల్ తన లాయర్లను కలవొచ్చు.