రఘురామ పేరే పరిశీలించలేదు – బీజేపీలో టిక్కెట్ ఎలా వస్తుంది ?

ఎన్‌డిఎ కూటమిలో బిజెపి అభ్యర్థిగా నరసాపురం ఎంపి రఘురామ కృష్ణరాజుకు టికెట్‌ దక్కుతుందని వేరే పార్టీల వారితో పాటు.. రఘురామ కూడా ఆశపడ్డారు. నిజానికి ఆయన బీజేపీలో చేరలేదు. జగన్ ను వ్యతిరేకించినంత మాత్రాన బీజేపీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చేయరు కదా. అందుకే ఆయన కు షాక్ ఇచ్చిందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజానికి కేంద్ర నాయకత్వం ఆయన పేరును ఎప్పుడూ ప రిశీలించలేదు . అసలు షాక్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఆయన బీజేపీ నాయకుడు కాదు.

నర్సాపురం నుంచి బీజేపీ సీనియర్ నేత శ్రీనివాసవర్మ

ఆదివారం ప్రకటించిన ఐదో విడత లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో నరసాపురం సీటు భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించారు. గత నాలుగేళ్లుగా సిఎం జగన్‌పై తనదైన శైలిలో రఘురామ విమర్శలు చేశారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన టిడిపి, జనసేన బహిరంగ సభలోనూ నరసాపురం నుంచి తప్పకుండా పోటీ చేస్తానని రఘురామ ప్రకటించారు. అయితే ఆయనకు ఆయన ప్రకటించుకుంటే… మిగతా పార్టీలు ఫాలో అవ్వాలన్న రూల్ లేదన్న సంగతి స్పష్టయింది. ఆయన పై స్థాయిలో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.

ఎంపీ అభ్యర్థులు వీళ్లే !

సీట్లు దక్కించుకున్న వారిలో అరకు (ఎస్‌టి) కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సిఎం రమేష్‌, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తిరుపతి (ఎస్‌సి) నుంచి గూడూరు వైసిపి ఎమ్మెల్యే వరప్రసాదరావు, రాజంపేట నుంచి మాజీ సిఎం ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

నేడు అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన !

టిడిపి, జనసేనతో సర్దుబాట్లలో భాగంగా బిజెపి 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. అధికారికంగా ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన సోమవారం వెలువడనుందని బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి. విజయవాడ వెస్ట్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, కైకలూరు నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ధర్మవరం నుంచి బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ పేర్లు ఖరారైనట్లు సమాచారం. మిగిలిన సీట్లలో అభ్యర్థులు ఎవరనేది సీట్ల ప్రకటన తర్వాత తెలిసే అవకాశం ఉంది.