ఐపీసీ కాదు ఇక “భారతీయ న్యాయ సంహిత” శిక్షలు – బ్రిటిష్ బూజును దులిపేస్తున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం దేశ క్రమినల్ చట్టాలన్నింటిని సమూలంగా మార్చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ బ్రిటిష్ కాలం నాటిదని.. ఇప్పుడు దాని అవసరం లేదని .. నిర్ణయానికి వచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లను రద్దు చేసి.. వాటి స్థానాల్లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఐపీసీ స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకమైన మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

మారిన కాలానికి అనుగుణంగా కొత్త చట్టాల్లో శిక్షలు

కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ‘భారతీయ సాక్ష్య’ చట్టాలకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టాల ప్రకారం శిక్షల్ని కూడా మార్పు చేశారు. ఇప్పటి వరకూ జీవిత ఖైదు అంటే పధ్నాలుగు ఏళ్లు అనే లెక్కలు వేసేవాళ్లు. కానీ ఇక నుంచి జీవిత ఖైదు అంటే.. జీవించి ఉన్నంత వరకూ అని అర్థం. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మహిళలు, పిల్లలు, హత్యలు, ప్రభుత్వ వ్యతిరేక నేరాలను కొత్త బిల్లుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చిన్నచిన్న నేరాలకు సంఘసేవను శిక్ష విధించబోతున్నారు. వేర్వేరు నేరాలకు సంబంధించిన జరిమానాలు, శిక్షలను పెంచారు. మైనర్లను అత్యాచారం చేస్తే ఉరిశిక్ష , సామూహిక అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల జైలు , మూక దాడులకు ఏడేళ్ల జైలు, 7 సంవత్సరాలకుపైగా శిక్ష విధించే కేసుల్లో ఫోరెన్సిక్ సాక్ష్యాలు తప్పనిసరి అని ఈ చట్టాల్లో ఉంది. ఇక ఎక్కడి నుంచైనా ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చునని.. సెర్చ్ ఆపరేషన్ చేస్తే సెర్చ్ వారెంట్‌తోపాటు ఎవరి వద్దకైనా వెళ్తే వీడియోగ్రఫీ చేయాల్సిందేనని చట్టాల్లో మార్చారు. ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జిషీట్ వరకు అన్ని డిజిటైలైజ్ చేయాల్సి ఉంటుంది.

దేశద్రోహం చట్టం రద్దు

దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయనున్నట్టు లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం ఓ ప్రతిపాదన చేసినట్టు వెల్లడించారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ చట్టం వివాదాస్పదమవుతోంది. కుట్రపూరితంగా కావాలనే కొందరిపై ఈ చట్టం పేరుతో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్న విమర్శలు, ఆరోపణలూ ఉన్నాయి. రద్దు చేయాలని ప్రతిపక్షాలు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న క్రమంలోనే మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్‌పై సామూహిక అత్యాచారం చేసిన నేరస్థులకు మరణ శిక్ష విధిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో వెల్లడించారు. దేశ శిక్ష్మాస్మృతిలో పలు మార్పులు చేసిన కేంద్రం..మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ కొత్త బిల్లుల ప్రకారం…పలు నేరాలకు శిక్షను మరింత కఠినతరం చేశారు. ఆ నేరం చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టించేలా శిక్ష విధించనున్నట్టు అమిత్‌షా ప్రకటించారు.

ఇంకా బ్రిటిష్ చట్టాలెందుకు ?

“బ్రిటీష్ కాలం నాటి చట్టాలన్నింటినీ తొలగించాలన్నదే మా ఉద్దేశం. అందుకే శిక్షాస్మృతిలో మార్పులు చేర్పులు చేశాం. వీటి లక్ష్యం కేవలం శిక్షించడం మాత్రమే కాదు. న్యాయం చేయడం కూడా. నేరాలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే ఇలా కఠిన శిక్షలు వేయాలని నిర్ణయించుకున్నాం” . మూకదాడుల విషయంలో నేర తీవ్రతను బట్టి మరణశిక్ష విధిస్తామని తేల్చి చెప్పారు. ఇక ఎన్నికల సమయంలో మద్యంతో పాటు నోట్లు పంచడం సాధారణమైపోయింది. లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు అనధికారికంగా జరుగుతుంటాయి. వీటిని నియంత్రించేందుకూ కేంద్రం కొత్త ప్రొవిజన్ తీసుకురానుంది. ఓటర్లకు డబ్బులు పంచిన వాళ్లకు కనీసం ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తామని వెల్లడించింది. ఇక సామూహిక అత్యాచారాలపైనా కొరడా ఝుళిపించింది. ఈ కేసుల్లో నేరస్థులుగా రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్ష తప్పదు. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష విధిస్తారు.