కొత్తగా ప్రమాణం చేసిన 11 మంది మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. నిన్న ఢిల్లీ వెళ్లి అధినాయకత్వంతో చర్చించి శాఖలు కేటాయించారు. ఆయా మంత్రులకు శాఖలు కేటాయించినట్టు రాజ్‌భవన్‌కు సందేశం సీఎం కార్యాలయం పంపించింది. సీఎం రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖతోపాటు ఇతర కీలకమైన శాఖలు ఉండబోతున్నాయి. మిగతా మంత్రుల ఖాళీలు భర్తీ అయ్యేంత వరకు ఆ శాఖలు ఆయన చూస్తారు. ఆయన వద్ద మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ &అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా & ఆర్డర్, కేటాయించని విద్య ఇతర శాఖలు కూడా ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు కీలకమైన శాఖలు కేటాయించారు. ఆర్థిక శాఖతోపాటు విద్యుత్ శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు.
ఉత్తమ్‌కు హోంశాఖ ఇచ్చినట్లుగా మొదట్లో ప్రచారం
తెలంగాణలో మంత్రి వర్గం ప్రమాణం చేయగానే శాఖలను కేటాయించేశారన్న ఓ వార్త వైరల్ అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ.. డిప్యూటీ సీఎంకు భట్టి విక్రమార్కకు రెవిన్యూ ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు. సాయంత్రం వరకూ అదే హైలెట్ అయింది. నిజానికి శాఖల కేటాయింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. అంతే కాదు.. ఆ శాఖల గురించి వైరల్ అయిన తర్వాత కూడా పట్టించుకోలేదు. కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి కార్యాలయం ఓ స్పష్టత ఇచ్చింది. కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రులకు ఎలాటి శాఖలు కేటాయించలేదని.. కేటాయించిన తర్వాత అధికారిక ప్రకటన విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దీంతో వైరల్ అయిన మంత్రుల జాబితా అంతా ఫేక్ అని తేలిపోయింది.
చివరికి తూచ్ అని.. తన రాజకీయం చేసిన రేవంత్
రేవంత్ కేబినెట్ లో హోంమంత్రి పదవి అత్యంత కీలకమైనది. ఏ ప్రభుత్వంలో అయినా హోంమంత్రి నెంబర్ టు. అయితే గత రెండు ప్రభుత్వాల్లో హోంమంత్రులు నిమిత్త మాత్రంగా ఉండేవారు. గత ప్రభుత్వంలో మహమూద్ అలీ హోంమంత్రిగా ఉన్నారో లేదో కూడా తెలియనంత గుట్టుగా విధులు నిర్వహించేవారు. కానీ కాంగ్రెస్ లో అలాంటి పరిస్థితి ఉండదు. హైకమాండ్ ఎవరికి చెబితే వారికి హోంశాఖ ఇవ్వాల్సి ఉంటుందని అనుకున్నారు. మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి సహజంగా ఆయనకు హోంశాఖ ఇస్తారని అనుకున్నారు. కానీ ఉత్తమ్ అయినా భట్టి విక్రమార్క అయినా రేవంత్ రెడ్డికి ఇబ్బందే. రేవంత్ సీఎం కావడాన్ని వ్యతిరేకించాు. వారికి వారిద్దరికీ.. నేరుగా పాలనతో సంబంధం లేదని ఒత్తిడికి గురయ్యే శాఖలు ఇచ్చారు.
హైకమాండ్ ఆర్థిక అవసరాలు తీర్చి పలుకుబడి పెంచుకుంటున్నారా ?
అదే సమయంలో సీనియర్లకు పెద్దగా ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించారు. వారు అసంతృప్తికి గురయినా ప్రత్యేకంగా చేసేదేమీ ఉండదు. ప్రస్తుత ఎన్నికల సమయంలో.. హోంశాఖ అత్యంత కీలకం. అందుకే రాగానే ఇంటలిజెన్స్ చీఫ్ ను మార్చేశారు. శివధర్ రెడ్డిని నియమించారు. ముందు ముందు అనేక కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకే హోంశాఖను తన వద్దే ఉంచుకుంటానని రేవంత్ రెడ్డి అంగీకరింప చేసి ఉంటారని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మార్క్ రాజకీయాల్ని చేసి తన పట్టు నిరూపించుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్లకు మించిన రాజకీయం రేవంత్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు.