నో స్టాపింగ్ జగన్ – 10 మంది మంత్రులకూ షాక్ ! వాళ్లే వీళ్లు..

వైసీపీ అధినేత జగన్ ఈ సారి వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో మార్చేయాలనుకంటున్నారు. వరుసగా జాబితాలు ప్రకటించబోతున్నారు. వీరిలో పది మంది వరకూ మంత్రులు ఉన్నారంటున్నారు. . 11మంది ఇన్ చార్జులను మారుస్తూ సోమవారం బయటకొచ్చిన లిస్టు జస్ట్ శాంపిల్ మాత్రమే. గెలుపే లక్ష్యంగా అని ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి.. మంత్రుల స్థానాల మార్పునకు కూడా కారణం అదే అనుకోవాలి. ఏకంగా 65సీట్లలో మార్పులు చేర్పులు, తొలగింపులు జరుగుతుండటంతో మంత్రలు సైతం పక్కకు తొలగాల్సి వస్తోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఆ మంత్రులు వీళ్లే !

అంబటి, రోజా, ఉషశ్రీ చరణ్, గుమ్మనూరు జయరాం, నారాయణ స్వామి, చెల్లుబోయిన, జోగి రమేష్, విడదల రజని, అంజాద్ భాషా, పినిపె విశ్వరూప్ మొత్తం 10మంది మంత్రులకు టికెట్లే లేవని చెబుతున్నారు. మరి కొంతమంది ఈ లిస్టులో చేరవచ్చు కూడా అంబటి రాంబాబు వైసీపీకి పేరున్న ఫేస్. ప్రత్యర్థులపై మాటలతో దాడి చేసే ఈ మంత్రి సొంత జిల్లాలో మాత్రం వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సత్తెనపల్లిలో అనేక సందర్భాల్లో ప్రజలు నేరుగా ఎదురుతిరిగిన సంఘటనలు ఉన్నాయి. ఎంతో కాలంగా పార్టీతో ఉన్న రోజాకు మొదటి విడతలో మంత్రిపదవి రాకపోవడంతో.. ఆమెకున్న పాపులారిటీ దృష్ట్యా రెండోసారి ఇచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయిన రోజా.. సొంత నియోజకవర్గంలో మాత్రం ప్రజలకు దూరంఅయ్యారు. స్థానిక రాజకీయాలు కూడా అందుకు కారణం. లోకల్ లీడర్లంతా ఎదురుతిరగడంతో ఆమెకు తీవ్రంగా ఎదురుగాలి ఉంది.

వివాదాస్పద మంత్రులకూ నో చాన్స్

చెల్లుబోయిన శ్రీనివాస్ కు ఈసారి సుభాష్ చంద్రబోస్ నుంచి గట్టి పోటీ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తనకే టికెట్ కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాజమండ్రి ఎంపీగా చెల్లుబోయిన ను పంపాలని అనుకుంటున్నారు. ఉషశ్రీ చరణ్ తో పార్టీకి చాలా సమస్యలు వచ్చాయి. లోకల్ లీడర్లతో సయోధ్య కుదరకపోవడంతోపాటు.. భూ ఆక్రమణ ఆరోపణలు పార్టీని ఇబ్బంది పెట్టాయి. కాబట్టి ఆమెకు వీడ్కోలు చెబుతున్నారు. గుమ్మనూరు జయరాం పై వచ్చినన్ని ఆరోపణలు ఏ మంత్రిపైనా రాలేదు. చాలా తీవ్ర ఇబ్బందులున్నప్పటికీ ఆయన్ను మంత్రిగా పూర్తి కాలం కొనసాగించారు. మంత్రులను మార్చినప్పుడు కూడా జయరాం ను తప్పించలేదంటే కారణం వాల్మీకి వర్గం నుంచి మరో వ్యక్తి లేకపోవడమే. ఇప్పుడు తలారీ రంగయ్యను అసెంబ్లీకి తెచ్చి జయరాంను తప్పించేస్తున్నారని అంటున్నారు.

సీనియర్లు లోక్ సభకు వెళ్లే అవకాశం !

పెడన నుంచి ఉన్న జోగి రమేష్ ది సొంత నియోజకవర్గం కాదు. ఆయనపై వ్యతిరేకత ఉన్నప్పటికీ వైసీపీ గాలిలో గెలుచుకొచ్చారు. ఇప్పుడు అక్కడ గెలిచే అవకాశం లేకపోవడంతో ఏలూరు ఎంపీగా వెళ్లమని చెబుతున్నారు. చాలా కాలం మంత్రిగా ఉన్న పినిపె విశ్వరూప్‌ పై కూడా వ్యతిరేకత ఉంది. కొనసీమ అల్లర్ల సమయంలో అది మరింత పెరిగింది. ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా కూడా పక్కన పెట్టి.. ఆయన కుమారుడికి మరోచోట టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు. వీళ్లు కాకుండా సీనియర్ మంత్రులు ధర్మాన, బొత్స, పెద్దిరెడ్డి, బుగ్గన వంటి వారి సీట్లపై ఏ ప్రభావం లేనప్పటికీ.. పార్టీ వ్యూహాత్మకంగా కొంతమందిని ఎంపీగా పోటీ చేయాలని చెబుతోంది. ధర్మాన, బొత్సతో ఇవే మంతనాలు నడుస్తున్నాయి. అందుకేనేమో బొత్స సత్యనారాణ వేసీపీలో ఏదీ శాశ్వతం కాదన్నారు.