తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిన తరవాత ఏపీ రాజకీయాలు మారిపోయాయి. ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలన్నీ కుండబద్దలు కొట్టి చెబుతున్నాయి.దాదాపుగా ప్రతీ సర్వే యాభై శాతానికిపైగా ఓట్లను.. 20 వరకూ లోక్ సభ సీట్లను సాధిస్తుందని చెబుతున్నాయి. మోదీ హవా… ఎన్డీఏ కూటమి వైపు ప్రజలు మొగ్గడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
లోక్‌సభ సీట్లలో ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు
పోలింగ్ సమయం దగ్గర పడుతూండటంతో… దేశంలోని అన్ని ప్రముఖ చానళ్లు ఫైనల్ సర్వేలను ప్రకటిస్తున్నాయి. ఏబీపీ సీఓటర్ సర్వే ఇరవై పార్లమెంట్ సీట్లు ఎన్డీఏ గెలుచుకుంటుందని తెలిపింది. న్యూస్ 18 పద్దెనిమిది సీట్లు , ఇండియా టీవీ 17, ఇండియా టుడే18, న్యూస్ ఎక్స్ 18, జీ న్యూస్ 17, ఇండియా న్యూస్ 18 సీట్లను ప్రకటించాయి. ఇక చిన్నా చితకా పోల్స్ ఇరవైకి పైగా సీట్లను ప్రకటించారు. ఎలా చూసినా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క సర్వే కూడా రాలేదు. అంటే ప్రజాభిప్రాయం స్పష్టంగా ఉన్నట్లే.
బీజేపీ పోటీచేస్తున్న ఆరింటిలోనూ విజయావకాశాలు
ఏపీలో బీజేపీ ఆరు లోక్ సభ సీట్లలో పోటీ చేస్తోంది. ఈ ఆరింటిలోనూ విజయావకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. కొన్ని సర్వే సంస్థలు ఆరు.. మరికొన్ని నాలుగు అంచనా వేస్తున్నాయి. నాలుగు నుంచి ఆరు స్థానాలు ఖాయమని అంచనా వేస్తున్నారు. అంటే 90 శాతం స్ట్రైక్ రేట్ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. లోక్ సభ విషయంలో దక్షిణాదిలో ఈ సారి మోదీకి మంచి ఆదరణ ఉంది. మరోసారి ఆయనే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే ఇలాంటి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో అదే దామాషా ప్రకారం విజయాలు
జాతీయ సంస్థలు అసెంబ్లీ ఎన్నికల సర్వేలను చేయడం లేదు. లోక్ సభ ఎన్నికల విషయంలోనే సర్వేలు చేస్తున్నాయి. అయితే ఎన్డీఏకు అనుకూల వాతావరణం ఉన్నందున అసెంబ్లీ సీట్లు కూడా అదే స్థాయిలో వస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో.. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.