బెజవాడలో కేశినేని బ్రదర్స్ బిగ్ ఫైట్ – గెలుపెవరిది ?

ఎన్‌టిఆర్‌ జిల్లాలో విజయవాడ ఎంపితోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా ఉంది. రాజధాని ప్రాంతం కావడంతోపాటు టిడిపికి పట్టున్న ఈ జిల్లాలో గత ఎన్నికల్లో అనూహ్యంగా వైసిపి హవా సాగింది. ఎంపి సీటుతోపాటు ఒక అసెంబ్లీ సీటులో మాత్రమే టిడిపి గెలవగలిగింది. వైసిపి ఆరు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో కేశినేని సోదరులు ఎంపి స్థానంలో, అసెంబ్లీ సీట్లలో ఉద్దండులు పోటీపడడంతో ఆసక్తి నెలకొంది.

అన్నదమ్ముల సవాల్

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో వైసిపి తరపున సిట్టింగు ఎంపి కేశినేని శ్రీనివాస్‌ ), టిడిపి తరపున కేశినేని శివ సాయినాథ్‌ ) పోటీలో ఉన్నారు. ఈ ఇద్దరూ సోదరులే. టిడిపి టికెట్‌ నిరాకరించడంతో నాని ఇటీవలే వైసిపిలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. దీంతో టిడిపి అధిష్టానం ఆయన సోదరుడు చిన్నిని రంగంలోకి దించింది. విజయవాడ తూర్పు అసెంబ్లీ నుంచి వైసిపి, టిడిపి అభ్యర్థులుగా దేవినేని అవినాష్‌, గద్దె రామ్మోహనరావు పోటీలో ఉన్నారు. ఇద్దరూ కమ్మ సామాజిక తరగతికి చెందినవారే. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గద్దెకు ఆ సామాజిక తరగతి అండగా ఉంది. టిడిపి రాష్ట్ర కార్యాలయంపైన, ఆ పార్టీ నేత పట్టాభి ఇంటిపైన దాడిలో అవినాష్‌ పాత్ర ఉందనే అభిప్రాయంతో ఉన్న ఆ సామాజిక తరగతి ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తోంది.

కూటమి అభ్యర్థుల ముందంజ

సెంట్రల్‌ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా పోటీలో ఉన్నారు. ఇక్కడ సిట్టింగు ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణును కాదని పశ్చిమం నుంచి వెలంపల్లిని తీసుకొచ్చి వైసిపి ప్రయోగం చేస్తోంది. ఆయనకు విష్ణు సహకారం అంతంతమాత్రంగానే ఉంది. బొండాకు జనసేనతో పొత్తు కలిసి వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ వైసిపి అభ్యర్థిగా షేక్‌ ఆసీఫ్‌, కూటమి నుంచి బిజెపి అభ్యర్థిగా రాజ్యసభ మాజీ సభ్యులు సుజనా చౌదరి పోటీలో ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న సుజనా గతంలో టిడిపిలో బలమైన నేతగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. వైసీపీ అభ్యర్థి బలహీనంగా ఉండటం సుజనాకు కలసి వస్తోంది.

వైసీపీ అభ్యర్థుల ఎదురీత

మైలవరం వైసిపి అభ్యర్థిగా జడ్‌పిటిసి సభ్యులు ఎస్‌ తిరుపతిరావు, టిడిపి అభ్యర్థిగా సిట్టింగు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆ పార్టీ ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్షులు బొల్లా కిరణ్‌ రంగంలో ఉన్నారు. వసంత ఇటీవల వైసిపి నుంచి టిడిపిలో చేరారు. ఆయనకు టిడిపి టికెట్‌ కేటాయించింది. మాజీ మంత్రి దేవినేని ఉమా, పార్టీ సీనియన్‌ నేత బొమ్మసాని సుబ్బారావు టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. ఉమా నుంచి వసంతకు అంతగా సహకారం లేదు. సామాన్యుడైన వైసిపి అభ్యర్థి తిరుపతిరావు.. వసంతను ఎదుర్కోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. తిరువూరు (ఎస్‌సి) నుంచి వైసిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, టిడిపి అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా లాము తాంతియా కుమారి పోటీలో ఉన్నారు. స్వామిదాసు ఇటీవల టిడిపి నుంచి వైసిపిలో చేరారు. విజయవాడ ఎంపి కేశినేని నాని మద్దతు ఆయనకు బాగా ఉంది. నందిగామ (ఎస్‌సి) నుంచి వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మంద వజ్రయ్య రంగంలో ఉన్నారు. జగ్గయ్యపేట వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్‌తాతయ్య (రాజగోపాల్‌) పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మల్యేలకు వ్యతిరేకత ఎక్కువగా ఉండటం వైసీపీ అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది.