నిన్నటి దాకా ఆమె మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎంపీగా ఉన్నారు. ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా పేరు పొందిన ఆమె తొలి నుంచి హిందూత్వవాదాన్ని సమర్థిస్తూ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీలో చేరారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అమరావతి నుంచే ఆమె మళ్లీ పోటీ చేస్తున్నారు..
ఫడ్నవీస్ సమక్షంలో చేరిక
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో నవనీత్ రాణా బీజేపీలో చేరారు. భారీ సంఖ్యలో అమరావతి, నాగ్ పూర్, వాధ్వా నుంచి ఆమె మద్దతుదారులు తరలిరావడంతో కోలాహలం నెలకొంది. ఎమ్మెల్యే అయిన ఆమె భర్త రవి రాణా కూడా వెంట రాగా…భార్య,భర్త ఇద్దరూ కమల తీర్థం పుచ్చుకున్నారు.
హనుమాన్ చాలీసా పఠనంతో ఫేమస్…
అనేక అంశాలు నవనీత్ రాణాను లైమ్ లైట్లో ఉంచాయి. అందులో 2022 నాటి హనుమాన్ చాలీసా పఠనం కూడా ఒకటని చెప్పాలి. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వివాదం ఏర్పడింది. 2022 ఏప్రిల్ లో ప్రభుత్వ, విపక్షాల మధ్య మాటల తూటాలు రేగుతుండగా.. ఇండిపెండెంట్ ఎంపీ అయిన నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణా కూడా వివాదంలో ఎంట్రీ ఇచ్చారు. హనుమాన్ జయంతి రోజు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ చాలీసా పఠించాల్సిందేనని, లేకపోతే తామే ఆయన నివాసం ఆ పనిచేస్తామని నవనీత్ రాణా అప్పట్లో ఛాలెంజ్ చేశారు. దానితో శివసేన కార్యకర్తలు ఆమెపై దాడులకు ప్రయత్నించారు. నవనీత్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తోసుకుని రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు తన డిమాండ్ ను విరమించుకున్న నవనీత్ రాణా.. విడిగా హనుమాన్ చాలీసాను పఠించారు..
వీఐపీ భద్రత కల్పించిన ప్రభుత్వం
అప్పట్లో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు నవనీత్ రాణాకు వీఐపీ భద్రతను కల్పించారు. నవనీత్ కౌర్ భద్రతకు ముప్పు ఉందని హోం శాఖకు కేంద్ర నిఘా సంస్థ ప్రత్యేక నివేదిక అందజేసింది. ఈ సిఫారసులకు ఆమోదం తెలిపిన కేంద్ర హోంశాఖ పారామిలిటరీ సాయుధ కమాండోలతో నవనీత్ కు ‘వై’ కేటగిరీ భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి బీజేపీ కేంద్ర నాయకత్వానికి దగ్గరైన నవనీత్ రాణా ఇప్పుడు ఏకంగా బీజేపీ టికెట్ పొందారు. ముంబైలో జన్మించిన ఆర్మీ అధికారి కుమార్తె ఆమె. అసలు పేరు నవనీత్ కౌర్. అందాల పోటీలు, మోడలింగ్ తర్వాత దక్షిణాది భాషా చిత్రాల్లో నటించారు. ముంబైలో సెటిలైన సందర్భంగా రవి రాణాను పెళ్లి చేసుకోవడంతో ఆమె పేరు నవనీత్ రాణాగా మారింది. 2014లో ఎన్సీపీ తరపున తొలి సారి అమరావతి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన నవనీత్.. 2019లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఈ సారి ఏమవుతుందో చూడాలి.