ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి పెట్టని కోట లాంటి నియోజకవర్గం పీలేరు. రాష్ట్ర విభజన కారణంగా నల్లారి కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంది. కిరణ్ కుమార్ రెడ్డి చాలా రోజులు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండటం ఆయన సోదరుడు ఒంటరి పోరాటం చేయడంతో రెండు సార్లు ఓడిపోయారు. కానీ ఇప్పుడు బ్రదర్స్ కలిశారు. వేరు వేరు పార్టీలు అయినా ఒకే కూటమి అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఎంపీగా కిరణ్.. ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు కిషోర్ పోటీ చేస్తున్నారు.
పీలేరులో నల్లారి కుటుంబానికే ఆదరణ
ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో పీలేరు ఒకటి. ఈ సెగ్మెంట్ అటు తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, రాయచోటి, పలమనేరు వంటి ప్రాంతాలకు మధ్యలో అన్నిటికీ 57 కిలోమీటర్ల డిస్టెన్స్ లో సెంటర్ లో ఉంటుంది. రాజకీయంగా, వాణిజ్యపరంగా కీలక ప్రాంతమిది. వాయల్పాడుగా ఉన్న నియోజకవర్గాన్ని 2009లో పీలేరులో కొన్ని భాగాలు కలిపి కొత్త నియోజకవర్గంగా మార్చారు. నల్లారి అమరనాథరెడ్డి ఇక్కడి ప్రజల మన్ననలు పొందారు. ఆయన హఠాన్మరణంతో..ఆయన కుమారుడు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సీఎం అయ్యే వరకూ సోదరులు తెర వెనుకే ఉన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ “జై సమైక్యాంధ్ర పార్టీ” పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసి పోటీ చేశారు. కానీ.. సొంత నియోజకవర్గం పీలేరులోనూ విజయం సాధించలేకపోయారు. రెండో స్థానంలో నిలిచారు.
అన్ని చోట్లా నల్లారి కుటుంబానికి అభిమానులు
పీలేరు నియోజకవర్గంలో పీలేరు, కలికిరి, కలకడ, కేవీపల్లె, గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాలు, 293 పోలింగ్ కేంద్రాలున్నాయి. మొత్తం ఓటర్లు రెండున్నర లక్షల మంది వరకూ ఉన్నారు. నల్లారి కుటుంబంపై ప్రజల్లో అభిమానం ఉంది. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు.. నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. వైసీపీ అభ్యర్థి పేరుకు… చింతల రామచంద్రారెడ్డే కానీ.. ఆయనకు… కర్త, కర్మ, క్రియ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. నల్లారి కుటుంబంతో అనాదిగా తమకున్న రాజకీయ వైరం కారణంగా పెద్దిరెడ్డి కుటుంబం చింతలను అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. ఆర్థిక వనరులు సహా.. ఎలక్షనీరింగ్ కూడా పీలేరులో పెద్దిరెడ్డే చూసుకుంటారు. అందుకే పీలేరులో గట్టి పోటీ ఉంటోంది. కానీ ఈ సారి రెండు సార్లు ఓడిపోయారన్న సానుభూతి నియోజకవర్గంలో కనిపిస్తోంది.
కిరణ్ పార్లమెంట్‌కు పోటీ చేయడం ప్లస్
రెండు సార్లు ఓడినా నల్లారి కిషోర్ ప్రజల్లోనే ఉన్నారు. ఫార్టీ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇది వారి అభిమానుల్ని ఏకం చేస్తోంది.
టీడీపీ-జనసేన పొత్తుతో 15 శాతం వరకూ ఉన్న బలిజ ఓటర్ల మద్దతు ఏకపక్షంగా వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి గతంలో రెండుసార్లు ఓడిన సానుభూతి, జనసేనతో పొత్తు కూడా టీడీపీ అభ్యర్థికి కీ రోల్ పోషించబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. పీలేరు సెగ్మెంట్ లో బలిజ సామాజికవర్గం జనాభా 18 శాతంగా ఉంది. వీరిలో మెజార్టీ ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీవైపు పడుతాయన్న అంచనాలున్నాయి.