రైతులకు మోదీ వరం పీఎం కిసాన్ – ఏటా రూ. ఆరు వేలు నేరుగా ఖాతాల్లోకి !

వ్యవసాయ సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పిఎం-కిసాన్‌). ముఖ్యంగా రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించేందుకు రైతులకు పెట్టుబడి సాయంగా దీన్ని ప్రారంభించారు.

మూడు విడతలుగా ఆరు వేల రూపాయల సాయం

రైతు కుటుంబాలకు ఈ పథకం కింద ఏటా మూడు విడతలుగా మొత్తం ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారు. 2022లో జాతీయ సగటు వ్యవసాయ ఆదాయం బిజెపి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యంలో 70 శాతం కంటే ఎక్కువగానే ఉంది. కేంద్రం ఏటా అందజేస్తున్న ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం వారికి ఉపయోగపడుతోంది. 2018 డిసెంబర్‌ 1న ప్రారంభమైన ఈ పథకాన్ని తొలుత చిన్నకారు, సన్నకారు రైతుల కోసం ఉద్దేశించారు. ఆ తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. అందరికి ఉపయోగపడేలా చేశారు.

11 కోట్ల మందికిపైగా లబ్దిదారులు

పథకాన్ని ప్రారంభించి ఐదు సంవత్సరాలు గడిచాయి. ఇప్పటి వరకూ లబ్దిదారులకు 16 విడతలుగా ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. 2021-22 నాటికి పథకంలో 11.2 కోట్ల మంది రైతులు అత్యధికంగా సాయం పొందారు.
గత సంవత్సరం మార్చి నాటికి మూడు కోట్ల మంది మహిళా రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. రైతు కుటుంబం నెలకు సగటున రూ. 10,218… అంటే ఏడాదికి రూ.1,22,616 ఆదాయం పొందుతోందని 2019లో అంచనా వేశారు. 2022 నాటికి వార్షిక ఆదాయం రూ.1,67,000కు పెరిగింది. మోదీ ప్రభుత్వం చేపట్టిన అనూహ్య నిర్ణయాల వల్లే ఇది సాధ్యం అయింది.

రైతులకు మరింత సాయం చేసే ఆలోచన

ఏటా మూడు విడతలుగా అందజేస్తున్న ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది. దేశంలోని 76.5 శాతం రైతు కుటుంబాలకు రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉంది. వీరి సగటు నెలసరి ఆదాయాన్ని ఇంకా పెంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల తర్వాత చిన్న రైతులకు పీఎం కిసాన్ సాయం పెంచే అవకాశం ఉంది.