ప్రధాని మోదీ ఇప్పుడు కేంద్రంలోని అధికారపార్టీ బీజేపీకి నెంబర్ వన్ స్టార్ క్యాంపైనర్. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కనిష్టంగా రోజుకు మూడు సభల్లో ఆయన ప్రసంగిస్తున్నారు. ప్రతీ సభకు జనం లక్షలాదిగా వస్తున్న తరుణంలో మోదీ అజెండా కూడా స్పష్టంగానే ఉంది. సగం సమయం సంక్షేమం, అభివృద్ధిపై వివరణకు కేటాయిస్తుంటే, మిగతా సగం సమయం దేశాన్ని కాంగ్రెస్ ఎలా అథోగతి పాలు చేసిందో చెప్పేందుకు వినియోగిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడే ప్రతీ మాటకు, వేసే ప్రతీ అడుగుకు ఆయన దగ్గర కౌంటర్ ఉంది…
అది ముస్లిం లీగ్ మేనిఫెస్టో…
రెండు మూడు సభల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ ప్రత్యేక ప్రస్తావన చేశారు. అబద్ధాల పునాదులపై ఒక మేనిఫెస్టో రచించారని ఆయన ఆరోపించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే ఆ పార్టీ ఉద్దేశమని మోదీ వ్యాఖ్యానించారు. స్వాతంత్రానికి ముందు ముస్లిం లీగ్ చర్యలు ఎలా ఉండేవో, ఇప్పుడు అదే తరహాలో కాంగ్రెస్ తన మేనిఫెస్టో రూపొందించిందని మోదీ అన్నారు. దేశాన్ని వంద సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే చర్యలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతోందని మోదీ అభిప్రాయపడ్డారు. మేనిఫెస్టోలో అనేక అంశాలు తిరోగమన విధానాలకు దర్పణం పడుతున్నాయని మోదీ అటాక్ చేశారు..
ఆర్థిక సామాజికాభివృద్ధే బీజేపీ ధ్యేయం..
కాంగ్రెస్ ఆలోచన వేరు, బీజేపీ ఆలోచన వేరని… తాము దేశ ప్రజల స్వల్పకాలిక ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక అంశాలను కూడా పరిగణిస్తామని ఆయన చెప్పారు. దేశం ఆర్థిక పరిపుష్టి సాధించాలంటే బీజేపీకి ఓటెయ్యాలన్నారు. దాదాపు ఆరు దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అథోగతిలోకి నెట్టిందని, ఇప్పుడు తాము దాన్ని పరిష్కరించే పనిలో ఉన్నామని మోదీ వెల్లడించారు. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన పార్టీకి దేశ ప్రజలు ఓటేందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినందుకు ఓ కాంగ్రెస్ నేతను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారని ఆయన గుర్తుచేశారు. రాముడు, రామనామం లేని దేశాన్ని ఊహించగలరా అన్నది మోదీ ప్రధాన ప్రశ్న. ట్రిపుల్ తలాఖ్ నుంచి ముస్లిం మహిళలకు తాము విముక్తి కలిగించామని, దాన్ని మళ్లీ ప్రవేశ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు…
ఉతికి ఆరేసిన హిమంత బిశ్వా…
అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ కూడా కాంగ్రెస్ పార్టీపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పాకిస్థాన్ ఎన్నికలకు పనికివస్తుందని ఆయన సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అధికారానికి వస్తే ట్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370 మళ్లీ వచ్చేస్తాయని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. కులం ఆధారంగా, మతం ప్రాతిపదికన సమాజాన్ని విడగొట్టు ఓట్లు దండుకోవడమే పార్టీ లక్ష్యమని ఈ విషయంలో దేశప్రజలంతా జాగ్రత్తతగా ఉండాలని ఆయన కోరారు.