మోదీ 3.0లో వంద రోజుల ప్రణాళిక

ప్రధాని మోదీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమైంది. జనం బీజేపీ పట్ల అభిమానం, ఆసక్తితో పాటు విశ్వాసాన్ని పెంచుకున్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్.. ప్రధాని మోదీ ఒక్కరి వల్లే సాధ్యమని కూడా దేశ ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు ఎన్నికల వ్యూహం కంటే కూడా గెలిచిన వెంటనే ప్రజలకు చేయాల్సిందేమిటన్న ఆలోచనతో మోదీ ముందుకెళ్తున్నారు.

ప్రధానాంశాలపై దృష్టి పెట్టాలని ఆదేశం..

విపక్ష కూటమి మోదీ దరిదాపులకు కూడా రాలేదని బీజేపీ నేతృత్వ ఎన్డీయే నేతలు గ్రహించేశారు. మోదీ మ్యాజిక్ అంత రేంజ్ లో పనిచేస్తుందని కూడా వారికి అర్థమైంది.అందుకే బీజేపీ నేతలు ప్రత్యర్థుల విషయం పట్టించుకోవడం మానేశారు. దేశాభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. గత కేబినెట్ సమావేశంలో మోదీ మంత్రుల దగ్గర కొన్ని అంశాలను ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేయబోయే పనులపై అవగాహన ఉందా అని ఆయన వారిని అడిగారు. 2024 నుంచి 2029 వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాల్లో ఫోకస్ ఏరియాస్ ను గుర్తుంచాలని, వాటిపై దృష్టి పెట్టాలని మోదీ ఆదేశించారు..

మార్చి 3న కేబినెట్ భేటీ

మార్చి 3న కేంద్ర కేబినెట్ కీలక భేటీ జరుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వంలో అదే ఆఖరి కేబినెట్ భేటీ అవుతుంది. ఈ లోపు మంత్రులంతా తమ తమ శాఖలపై కసరత్తులు పూర్తి చేయాలి. ఆయా శాఖల సెక్రటరీలు (ఐఎఎస్ అధికారులు) ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంతకాలం చేసిన పనులపై నివేదికలు సిద్ధం చేయడంతో పాటు అధికారానికి వచ్చిన వెంటనే చేయబోయే పనులపైనా మంత్రులకు అవగాహన కల్పిస్తున్నారు. వంద రోజుల్లో చేపట్టబోయే పనుల తాలూకు ఫలితాలు ఐదేళ్ల పాటు కొనసాగాలన్నది బీజేపీ ఆకాంక్షగా కనిపిస్తోంది. దీనిపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగే వీలు కూడా ఉంది. 2019లో రెండో సారి అధికారానికి వచ్చిన తర్వాత 2021లో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగినప్పుడు కొందరు కొత్త వారికి అవకాశం లభించింది. వారందరి పనితీరు ప్రశంసనీయంగానే ఉందని బీజేపీ వర్గాల్లోనూ, మేథావుల్లోనూ వినిపిస్తున్న టాక్.

మోదీ ప్రభుత్వ విజయాలు

ప్రధాని మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో అనేక విజయాలతో ప్రజాసేవలో తరించింది. ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాఖ్ కు తిలోదకాలు లాంటి నిర్ణయాలతో అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకుంది. రామాలయ నిర్మాణంతో భారతీయులందరినీ సంతృప్తి పరిచింది. ఆర్థికరంగంలో గణనీయమైన అభివృద్ది సాధించి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఉంది. కార్పొరేట్ పన్నుల్లో చారిత్రక తగ్గింపు ద్వారా పెట్టుబడి పెరిగేందుకు దోహదం చేసింది. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ పీఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించింది. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా అక్రమ వలసదారులను నిలువరించడం సాధ్యపడింది. అన్నింటికీ మించి కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు మోదీ ప్రభుత్వ సేవలకు దేశప్రజలంతా ఫిదా అయ్యారు. అమిత వేగంతో వ్యాక్సిన్ ను అందుబాటుకు తెచ్చిన విధానం వారిని కట్టిపడేసింది. విదేశీయులకు సైతం వ్యాక్సిన్ అందించడం మోదీ సర్కారు ప్రత్యేకతగా చెప్పాలి….