కాంగ్రెస్ కు తలబొప్పి కట్టే నిర్ణయం

అడ్డదారులు తొక్కుతూ పాలనను గాడితప్పించడం, మెజార్టీ వర్గమైన హిందువులను ఇబ్బందిపెడుతూ అవమానించడం కాంగ్రెస్ కు అలవాటే. మైనార్టీలను ప్రసన్నం చేసుకునేందుకు వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు విమర్శలపాలవుతున్నా… ఆ పార్టీ మాత్రం ఎక్కడా సిగ్గు పడటం లేదు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, చీవాట్లు తిన్నా సరే నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూనే ఉంది. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం, దాని తర్వాత పర్యవసానాలు కాంగ్రెస్ కు తలవాచిపోయే పరిస్తితిని సృష్టించాయి.

ఆలయాలపై పది శాతం పన్ను

ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్న కర్ణాటక సిద్దరామయ్య ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయాలపై పది శాతం పన్ను విధించింది. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాలు తప్పనిసరిగా పది శాతం పన్ను చెల్లించాలని ప్రకటించేసింది. అదేమని అడిగితే ఆ నిధులను ధార్మిక పరిషత్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని కల్లబొల్లికబుర్లు చెప్పేసింది. పైగా దానిపై ప్రజల్లో చర్చ జరగకముందే ఆదరాబాదరాగా అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసుకుంది. కేవలం అసెంబ్లీలో తనకున్న బలంతో తప్పుడు చర్యలకు దిగారన్న విమర్శలను కూడా పట్టించుకోలేదు..

బిల్లును తోసిపుచ్చిన శాసనమండలి …

ఆలయాల జీర్ణోద్ధరణ,పునరుద్ధరణకు ప్రభుత్వ నిధులు వాడాల్సిన తరుణంలో వాటి ఆదాయానికే గండి కొట్టే చర్యలు చేపట్టారని పలు వర్గాల్లో విమర్శలు వచ్చాయి. అసెంబ్లీలో పాసైన బిల్లు కర్ణాటక శాసనమండలికి వెళ్లింది. అక్కడ చర్చకు వచ్చినప్పుడు సభ దాన్ని నిర్ద్వంద్యంగా తోసిపుచ్చింది. అక్కడ బీజేపీకి మెజార్టీ ఉండటంతో కాంగ్రెస్ ఆటను కట్టెయ్యగలిగింది. కాంగ్రెస్ కు 30 మంది సభ్యులున్న కర్ణాటక విధాన పరిషత్ లో బీజేపీకి 35 మంది ఉన్నారు. ప్రస్తుతం బీజేపీకి మద్దతిస్తున్న జేడీఎస్ కు 12 మంది ఉన్నారు. దానితో బిల్లును తిరస్కరించారు….

ఆలయాలకు మాత్రమే నిబంధనా..?

బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణం సిద్దరామయ్య ప్రభుత్వం మౌలికమైన తప్పులు చేయడమేనని చెబుతున్నారు. దేవాలయాలకు మాత్రమే పన్నులు విధించి.. ఇతర మత సంస్థలకు విధించలేదు. మసీదులు, చర్చిలను పది శాతం పన్ను ఎందుకు విధించలేదని బీజేపీ నిలదీస్తే…. కాంగ్రెస్ నేతలు దాటవేత ధోరణిని పాటించారు. సంక్షేమం కోసమే అంటూ టైమ్ పాస్ చేశారే తప్ప… ఇతర మతాల వారికి ఎందుకివ్వలేదనేది చెప్పలేకపోయారు. పైగా పాత నిబంధనలనే అమలు చేస్తున్నామంటూ బీజేపీ పైకి కాంగ్రెస్ చేసిన ఎదురుదాడి పనిచేయలేదు. శ్లాబులను అడ్జెస్ట్ చేయడం వల్ల ఆలయాల ఆదాయంలో భారీగా గండి పడుతుందని కాంగ్రెస్ గుర్తించలేకపోయింది. ఆలయాల ఆదాయాన్ని మళ్లిస్తే హిందువులు ఊరుకోరని గ్రహించలేకపోయింది..