జ్ఞానవాపిపై మీడియా తప్పుడు ప్రచారం – వారణాసి కోర్టు ఆగ్రహం

కాశీ విశ్వనాథ ఆలయం దగ్గరి జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి జిల్లా కోర్టు జులై 21న తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగ అధికారులు జులై 24న సర్వే ప్రారంభించారు. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. విచారణ జరిపిన న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధించింది. వారణాసి కోర్టు తీర్పుపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. ఈ నేపథ్యంలోనే మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యాజ్ఞానవాపి మసీదులో సర్వే జరపడం అవసరమని పేర్కొంది.

అనధికార సమాచారంపై ప్రచారం వద్దు..

సర్వే మొదలైనప్పటి నుంచి రోజూ ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో కొత్త కొత్త కథనాలు వండి వార్చుతున్నారు. ఇదీ అనవసర అపోహలకు దారితీస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనితో అంజుమన్ ఇంతేజామియా మసాజీత్ (మాస్క్ మేనేజ్ మెంట్ కమిటీ) వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించింది. నిరాధారమైన తప్పుడు వార్తలను ప్రచురించకుండా ఆదేశాలివ్వాలని కోర్టును కోరింది. వారి అభ్యర్థన మేరకు జిల్లా న్యాయమూర్తి ఏకే విశ్వేశా కీలక ఉత్తర్వులు ఇచ్చారు. కక్షిదారుల అధికారిక ప్రకటన లేకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం వచ్చినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అధికారిక సమాచారం లేకుండా ఏదంటే అది ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు.

నేరుగా కోర్టుకే సమర్పించాలి..

భారత పురావస్తు శాఖకు కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సర్వే జరపడం వరకే ఏఎస్ఐ పని అని, సమాచారం ఇవ్వడం కాదని గుర్తుచేసింది. కనీసం పిటిషనర్లు, డిఫెండెంట్ ఇద్దరికీ కూడా సమాచారం ఇవ్వాల్సిన పనిలేదంటూ ఏఎస్ఐకు ఊరట కలిగించింది. ఏఎస్ఐ అధికారులు తమ నివేదికను కోర్టుకు మాత్రమే సమర్పించాలని సూచించింది. కోర్టుకు కాకుండా బయట ఎక్కడైనా లీకులు ఇచ్చే అది చట్ట వ్యతిరేక చర్యే అవుతుందని కోర్టు తేల్చేసింది. ఎలాంటి చిన్న సమాచారమైనా కోర్టుకే సమర్పించాలని తేల్చేసింది.

యోగీ ప్రభుత్వ తీరుపై సంతృప్తి
జ్ఞానవాపి వ్యవహారం తెరమీదకు వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరుగుతుందోనని యూపీ ప్రజలు, ముఖ్యంగా వారణాసి వాసులు ఆందోళన చెందిన మాట వాస్తవం. జ్ఞానవాపి అని పిలవడమే తప్పు అని సీఎం యోగి చేసిన ప్రకటనను తప్పుపట్టేందుకే కొందరు ప్రయత్నించినప్పటికీ జనం ఎవరూ పట్టించుకోలేదు. యోగి ప్రభుత్వం పాజిటివ్ ధృక్పధంతో సమస్యను పరిశీలిస్తోందని జిల్లా కోర్టు అభిప్రాయపడ్డింది.శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకుంటున్నందుకు ప్రభుత్వాన్ని ప్రశంసించింది.