మాయావతి మేనల్లుడు, రాజకీయాల్లో మరో వారసుడు

వారసుడొచ్చాడు. ఈ సారి అత్యధిక జనాభా, అత్యధిక లోక్ సభా స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వారసుడు తళుక్కున మెరిశాడు. తనకు వయసైపోతుందనుకున్నారో… ఇక తిరగలేనని అనుకున్నారో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి రాజకీయ వారసుడిని ప్రకటించారు. తన తర్వాత తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ పార్టీని చూసుకుంటారని మాయావతి ప్రకటించారు.

ఐదారేళ్లుగా క్రియాశీలంగా ఆకాశ్ ఆనంద్..

ఆకాశ్ ఆనంద్ ఐదారేళ్లుగా క్రియాశీలంగా ఉంటున్నారు. మాయవతి సోదరుడి కుమారుడైన 28 ఏళ్ల ఆనంద్ బీఎస్పీలో చిరపరిచితుడే. అందరితో కలిసిపోయి పార్టీ పనులు చేసుకుంటూ వస్తున్నారు. 2017 మొదటి సారి ఆయన రాజకీయ వేదికపై కనిపించారు. యూపీ మహాకూటమి తరపున షారాన్పూర్ నగరంలో జరిగిన ర్యాలీలో తొలిసారి దర్శనమిచ్చారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ తో కలిసి వేదిక పంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలోనూ కీలక భూమిక వహించారు. అప్పట్లో మాయావతి ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఆకాశ్ ఆనంద్ రంగంలోకి దిగి ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆకాశ్ ఆనంద్ మూడు రాష్ట్రాల ఇంఛార్జ్ గా వ్యవహరించారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించారు.

ప్రస్తుతానికి జాతీయ సమన్వయకర్త

ఆకాశ్ ఆనంద్ ను మాయావతి పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు. జాతీయ సమన్వయకర్త బాధ్యతలు చూసుకోవాలని ఆదేశించారు. దానితో ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ గల్లీ వరకు ఆయన నాలుగైదేళ్లుగా అన్ని రాజకీయాలు అధ్యయనం చేశారు. దళితులు, గిరిజనులు, ఓబీసీలు, మతపరమైన మైనార్టీల సంక్షేమం కోసం పార్టీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీకి సంబంధించిన అనేక ప్రతినిధివర్గాల్లో ఆయనకు భాగస్వామ్యం ఇచ్చారు.

లండన్ లో చదువుకున్న ఆకాశ్ ఆనంద్

ఆనంద్ విద్యాధికుడే. లండన్లో ఎంబీఏ చేశారు. ప్రపంచ జ్ఞానం ఉన్న యువనాయకుడు. 2019లో తాను ప్రసంగించిన తొలి సదస్సులోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ సభ ఆగ్రాలో జరిగింది. పార్టీ విధానాల్లో సమూల మార్పులకు కూడా జాతీయ సమన్వయకర్తగా ఆకాశ్ ఆనంద్ శ్రీకారం చుట్టారు. ఇంతవరకు పాదయాత్రలకు బీఎస్పీ వ్యతిరేకం. ఈ ఏడాది ప్రారంభంలో సర్వజన్ హితయ్ సర్వజన్ సుఖయ్ సంకల్ప్ యాత్రను ఆయన 14 రోజుల పాటు నిర్వహించారు. లోక్ సభ ఎన్నికలకు బీఎస్పీని సమాయత్తపరిచే దిశగా ఈ యాత్ర జరిగింది. బాబా సాహెజ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అమలు చేస్తూ దళితుల అభ్యున్నతికి కృషి చేయడమే తన ధ్యేయమని ఆకాశ్ ఆనంద్ చెప్పుకుంటారు. విద్యా, సమానత్వం, సాధికారతే బీఎస్పీకి మూడు మూల సూత్రాలని మాయావతి వారసుడు కొత్త నిర్వచనాన్ని అందుకున్నారు. ఇక్కడ మరో అంశాన్ని కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే మాయావతి స్వయంగా వారసుడిని ప్రకటించడమే పెద్ద హైలైట్….