కర్నూలు జిల్లా వైసీపీ నేతల్లోనూ భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. శిల్పా కుటుంబీకులు రెండు చోట్ల ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారిని పక్కన పెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర, శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిలకు ఈ సారి టికెట్లు దక్కవన్న ప్రచారం జరుగుతోంది. దాంతో వారి వర్గీయుల్లో ఉత్కంఠ నెలకొంది.
కరిగిపోయిన శిల్పా బ్రదర్స్ బ్రాండ్
నంద్యాల రాజకీయాల్లో శిల్పా బ్రదర్స్‌కి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న అలాంటి శిల్పా కుటుంబంలో టికెట్ టెన్షన్ కనిపిస్తోంది .. ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యేగా సీనియర్ నేత శిల్పా మోహనరెడ్డి కుమారుడు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో మోహనరెడ్డి, తన వారసుడి విజయం కోసం పాటుపడ్డారు. అయితే ఇప్పుడు నంద్యాల వైసీపీలో నడుస్తున్న ఇంటర్నల్ వార్‌తో ఈసారి తమకు టికెట్ దక్కుతుందో ? లేదో? అన్న డైలమాలో ఉన్నారంట శిల్పా కుటుంబసభ్యులు.
నంద్యాలలో శిల్పా కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత
నంద్యాల వైసీపీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్న నాయకులు.. తమ సొంత క్యాడర్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సొంత అజెండా నడిపిస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర వర్సెస్ గోకుల్‌రెడ్డి మధ్య కొంతకాలంగా వర్గ విభేదాలు ఉన్నాయి. ఒకే పార్టీ అయినప్పటికీ ఎమ్మెల్యేతో పనిలేకుండా .. ఆత్మగౌరవ యాత్ర పేరిట నంద్యాలలో పాదయాత్ర చేశారు గోకుల్ రెడ్డి.. యాత్రకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవటంతో ఆగ్రహానికి లోనైన గోకుల్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యేనే తన యాత్రను అడ్డుకునేలా చేశారని ఫైర్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో రెండు వర్గాలు చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ.. కలిసి మాత్రం పనిచేయడం లేదు. ఎవరికి వారు సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తుండంతో.. పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. వైసీపీ పెద్దలు జోక్యం చేసుకుని వారిద్దరి మధ్య సఖ్యత కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.
శ్రీశైలం టిక్కెట్ కూడా చక్రపాణికి దక్కనట్లే
మరోవైపు శిల్పా బ్రదర్స్‌లో ఒకరైన శిల్పా చక్రపాణి.. శ్రీశైలం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. పార్టీ అధిష్టానం శిల్ప చక్రపాణి కు అనేకసార్లు తమ పని తీరు మార్చుకోవాలని.. ప్రజలలోకి వెళ్లాలని చెప్పిన శిల్పా చక్రపాణి పట్టించుకోలేదన్న ప్రచారం ఉంది. ఆయన వైఖరితో నియోజకవర్గ పరిధిలో నాయకులు కార్యకర్తలు ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారంట.. చక్రపాణి అనుచరులు చేసిన భూదందాలు, దౌర్జన్యాలు వివాదాస్పదంగా మారాయి. ఇక అక్కడ వర్ధన్ బ్యాంకు స్కాంలో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగానే శిల్పా బ్రదర్స్ వైసీపీ టికెట్లు దక్కుతాయన్న నమ్మకం లేక.. టీడీపీ వారితో మంతనాలు సాగిస్తున్నారన్న ప్రచారం స్టార్ట్ అయింది.