జైలు నుంచి కేజ్రీవాల్ చట్ట వ్యతిరేక చర్యలు..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి మూడు రోజులవుతోంది. తొమ్మిది సార్లు సమన్లను ధిక్కరించిన కేజ్రీవాల్ ను ఢిల్లీ హైకోర్టు అనుమతితోనే ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఐనా ఏదో అన్యాయం జరిగిపోయినట్లు, కొంపలు ముగినిపోయినట్లు ఆప్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. దేశప్రజలంతా ఛీకొడుతున్నా వారి వైఖరి మాత్రం మారలేదు. బీజేపీపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు…

కారాగారం నుంచి తొలి ఉత్తర్వు..

అధికారులు అరెస్ట్ అయితే వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. కేసు కొట్టివేసిన తర్వాతే ఉద్యోగంలోకి తీసుకుంటారు. రాజకీయ నాయకులు అరెస్టు అయితే పదవికి రాజీనామా చేయడం సంప్రదాయంగా వస్తోంది. బెయిల్ పొందిన తర్వాత మళ్లీ ప్రమాణ స్వీకారం చేయడం చాలా కాలంగా జరుగుతున్నది. వితండవాది, అవినీతి శిఖరం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం అలా చేయలేదు. జైలులోనే సీఎంగా కొనసాగుతూ ఢిల్లీని పాలిస్తానని చెప్పుకున్నారు. ఆప్ నేతలు కూడా అదే మాటను జనంలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా జైలు నుంచి ఢిల్లీ జలమండలికి సంబంధించిన ఒక ఉత్తర్వుపై కేజ్రీవాల్ సంతకం పెట్టారు. జైలులో ఉన్న సీఎం ఉత్తర్వులు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి అని చెప్పేందుకు సందేహపడాల్సిన పనిలేదు.ఇప్పుడా ఉత్తర్వుల్లో ఏముందో ఢిల్లీ మంత్రి అతిషి రాష్ట్ర ప్రజలకు చెబుతారు.

సీఎం కుర్చీలో కేజ్రీవాల్ భార్య సునీత

కేజ్రీవాల్ పార్టీ ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. పైగా వారసత్వ రాజకీయాలకు తెరతీసే ప్రయత్నంలో ఉంది. కేజ్రీవాల్ అరెస్టు అయితే కొత్త ముఖ్యమంత్రి వచ్చే వరకు సీఎం చైర్ ఖాళీగా ఉండాలి. లేనిపక్షంలో కేజ్రీవాలే మళ్లీ వచ్చి కూర్చోవాలి. ఢిల్లీలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ కీలక భూమిక పోషించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం కుర్చీలో కూర్చుని మరీ ఇంటర్వూలు ఇస్తున్నారు. ఈడీపై దుమ్మెత్తిపోస్తున్నారు. కేజ్రీవాల్ ను కలుసుకునేందుకు అనుమతి పొందిన ఆమె ఆ అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఒక ప్రకటన రాసి కేజ్రీవాల్ తో సంతకం పెట్టించి బయటకు తెచ్చి విడుదల చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను కూడా కేజ్రీవాల్ పేరుతో ఇప్పించినదీ ఆమెనని చెబుతున్నారు..

ఆప్ తీరుపై బీజేపీ ఆగ్రహం…

ఆమ్ ఆద్మీ పార్టీ తీరుపై ఢిల్లీ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ తక్షణమే రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఉద్యమించబోతున్నారు. జైలు నుంచి గ్యాంగులు పాలిస్తాయని, ప్రజా నాయకులు కాదని ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. స్వరాజ్యం నుంచి సారాయి రాజ్యం దాకా దేశాన్ని తీసుకెళ్లిన ఘనత కేజ్రీవాల్ కు ఆయన పార్టీకి మాత్రమే దక్కుతుందని మనోజ్ తివారీ అంటున్నారు.