కళ్యాణదుర్గం టీడీపీలో మూడో కృష్ణుడు – ఈ రాజకీయాన్ని ఎవరూ అంచనా వేయలేరు !

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి కుమారుడు మారుతీ చౌదరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాదినేని ఉమా మహేశ్వరనాయుడు మధ్య ఇటీవల కాలం వరకు పచ్చగట్టి వేస్తే భగ్గుమనేది. నిన్న..మొన్నటి వరకు వీరిద్దరి మధ్య నీవెంత అంటే నీ వెంత అన్న పరిస్థితి ఉండేది. 2109 ఎన్నికల సమయంలో హనుమంతరాయచౌదరి కుటుంబానికి కాదని ఉమా మహేశ్వరనాయుడుకి అధిష్టానం టిక్కెట్టు ఇచ్చింది. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య గ్రూపు తగాదాలు తారాస్థాయిలో చేరాయి. ఈ తగాదాల నడుమే 2019 ఎన్నికల్లో అక్కడ టిడిపి ఓటమి చెందింది. ఆ తరువాత కూడా ఇవి కొనసాగుతూ వచ్చాయి.

కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చిన చంద్రబాబు

ఇప్పుడు అధిష్టానం ఆ స్థానం నుంచి ప్రముఖ కాంట్రాక్టర్‌ అమిలినేని సురేంద్రబాబును బరిలో దింపే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. గత వారం నుంచే ఆయన అక్కడ గృహ నిర్మాణపు పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉన్నఫలంగా ఇద్దరు నేతలు మారుతీ చౌదరి, ఉమా మహేశ్వరనాయుడు ఏకమై మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు స్థానికులం, పార్టీ కోసం జెండాలు మోసినవాళ్లం. తమకు కాదని స్థానికేతరులకు ఏ రకంగా టిక్కెట్టు ఇస్తారని అధిష్టానాన్ని వీరు ప్రశ్నిస్తుండటం గమనార్హం. తమలో ఎవరికిచ్చినా పార్టీ విజయానికి కృషి చేస్తామని కలసి చెప్పడం ఆ పార్టీ శ్రేణులనే విస్మయానికి గురి చేసింది. క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు కలసి ఈప్రకటన చేయడం నాయకులను, కార్యకర్తలను విస్మయానికి గురి చేసింది.

పోటీ చేయాలన్న టార్గెట్ గా సురేంద్ర బాబు

సురేంద్రబాబు 2009 నుంచి రాజకీయ రంగ ప్రవేశానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రజారాజ్యం ద్వారా 2009లో అనంతపురం అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. ఆయనకే టిక్కెట్టు అని భావిస్తున్న తరుణంలో చివరి నిమిషంలో మార్పు జరిగి టిసి.ప్రకాశ్‌కు ఇచ్చారు. దీంతో ఆయన కన్నీటి పర్యాంతమూ అయ్యారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో టిడిపి అనంతపురం అసెంబ్లీకి టిక్కెట్టు ఖరారైంది. చివరి నిమిషంలో మార్పు జరిగింది. దీంతో రెండోసారి నిరాశే ఎదురైంది. 2019లోనూ ప్రయత్నం చేసినా ఎక్కడా అవకాశం లభించలేదు. ఇప్పుడు తాజాగా 2024లో కళ్యాణదుర్గానికి దాదాపు ఖరారంటూ ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో అక్కడి నాయకులు ఈ రకమైన ప్రకటన చేయడంతో ఈసారి సురేంద్రబాబు పరిస్థితి ఏమవుతుందోనన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది

సురేంద్రబాబును ఉన్నం, ఉమా ఆపగలరా ?

పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులకు కాకుండా ఇతరులకు టికెట్‌ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పారు. పారిశ్రామికవేత్త ఇక్కడికి వచ్చి హల్‌చల్‌ చేస్తే సహించేది లేదని అన్నారు. విభేదాలను పక్కనపెట్టి పార్టీ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేస్తామని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన ఏ వ్యక్తికి టికెట్‌ కేటాయించిన గెలిపించుకునేందుకు ఇరు వర్గాల నాయకులు కార్యకర్తలు పనిచేస్తామని చెప్పారు. అయితే చంద్రబాబు ఇప్పటికే సురేంద్రబాబుకు మాటిచ్చారన్న ప్రచారం జరుగుతోంది.