కాళేశ్వరం డబ్బులు కేంద్రం ఇచ్చినవే – ఇవిగో నిజాలు !

కాళేశ్వరం ప్రాజెక్టు కు రూ. 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని ఎంపి నిశికాంత్ దూబే పార్లమెంట్ లో స్పష్టం చేశారు. దానిపై బీఆర్ఎస్ పార్టీ ఉలిక్కి పడింది. తప్పుడు సమాచారం సభలో ఇచ్చారని వెంటనే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు సభ్యుడిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఆ విషయంపై పదే పదే మాట్లాడుకోవడం ప్రారంభించారు. విస్తృతార్థంలో చూస్తే ఈ నిధులు బీజేపీ నేతృత్వంలోని కేంద్రమే ఇచ్చింది. అందుకే ఆ బీఆర్ఎస్ కూడా… ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పకుండా… బీజేపీ అబద్దాలు చెబుతోందంటూ ఆరోపణలు చేస్తున్నారు.

కాళేశ్వరంకు అయిన ఖర్చు ఎంత ?

తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చారు. తుమ్మిడిహెట్టి నుంచి వంద కి.మీ.ల దిగువకు తీసుకెళ్లి మేడిగడ్డ నుంచి మూడు స్టేజీల్లో ఎల్లంపల్లికి ఎత్తిపోసేలా మార్పులు చేశారు. పాత ప్రాజెక్టు డిజైన్‌‌లోనూ పలు మార్పులు చేశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ అంచనా 35 వేల కోట్లు మాత్రమే. కానీ రీడిజైన్ చేయడం వల్ల రూ.81 వేల కోట్లకు చేరింది. కానీ ఎప్పటికప్పుడు పనుల ఎస్కలేషన్‌‌కారణంగా ఖర్చు రూ.87 వేల కోట్లకు పెరిగింది. అడిషనల్‌‌ టీఎంసీ పనులతో నిర్మాణ వ్యయం రూ.1.15 లక్షల కోట్లు అయింది. కానీ ధరలు పెరుగుతూండటంతో ఇప్పుడు అది 1 లక్ష 49,317 కోట్లకు చేరిందని కాగ్ అంచనా.

రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత ?

కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోంది. ఇచ్చి ఉంటే ఎలా ఇచ్చారో చెప్పాలని బీఆర్ఎస్ అడగడం లేదు. అక్కడే లాజిక్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎప్పుడూ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించలేదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు ఎక్కడి నుంచి తెచ్చారు. విచ్చలవిడిగా అమ్మేస్తున్న భూముల డబ్బులతో కట్టారా .. లేకపోతే ధనిక తెలంగాణ ఆదాయంతో కట్టారా అటే.. బీఆర్ఎస్ నేతల దగ్గర సౌండ్ ఉండదు. కాళేశ్వరంకు ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి అప్పు తెచ్చిందే. అదంతా కేంద్ర సంస్థల నుంచి తెచ్చిందే. అందుకే బీజేపీ క్లెయిమ్ చేసుకుంటోంది. తాము ఉచితంగా ఇచ్చామని బీజేపీ ఎంపీ కూడా చెప్పలేదు. నిధులు ఇచ్చిందనే చెప్పారు.

కాళేశ్వరం కోసం కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు ఇవీ !

2015లో కాళేశ్వరం ఇరిగేషన్‌‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌‌ లిమిటెడ్‌‌ ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ద్వారా కాళేశ్వరం కోసం 87,449 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. పవర్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ నుంచి అత్యధికంగా 37,737 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అలాగే రూరల్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ నుంచి కూడా 30,536 కోట్లు అప్పు చేశారు. పంజాబ్‌‌‌‌‌‌‌‌ నేషనల్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలోని కన్సార్షియం 11,400 కోట్లు, నాబార్డ్‌‌‌‌‌‌‌‌ 8,225.97 కోట్లు, యూనియన్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా నేతృత్వంలోని కన్సార్షియం 7,400 కోట్లు, బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ బరోడా 2,150 కోట్ల లోన్లు ఇచ్చాయి.. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడిచేవి. కేంద్రం సహకారం లేకపోతే ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టేది కాదనేది బీజేపీ వాదన. అదే కారణంతో నిధులన్నీ తామే ఇచ్చామని భారతీయ జనతా పార్టీ నేతలు క్రెడిట్ తీసుకుంటున్నారు. నేరుగా పార్లమెంట్ లో కూడా అదే వినిపించారు.