భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఉద్యమం చేస్తే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో .. చూపించారు. పంచాయతీ నిధులను ఏపీ ప్రభుత్వం మళ్లించడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన ధర్నాల్లో జనసేన శ్రేణులు కూడా పాల్గొన్నాయి. ఒంగోలు, తిరుపతి వంటి చోట్ల జనసేన నేతలు… ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల తరవాత రెండు పార్టీల మధ్య కనిపించిని గ్యాప్ వచ్చింది. ఇప్పటి వరకూ ఎప్పుడూ… బీజేపీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో జనసేన… జనసేన పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో బీజేపీ పాలు పంచుకోలేదు. పొత్తులో ఉన్నామంటారు కానీ కలసి పని చేయలేదు. కానీ ఇప్పుడు జనసేనాధినేత మనసులో మార్పు వచ్చింది.
పురందేశ్వరి చొరవతో కలసి వస్తున్న జనసేన
పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పవన్ తో ఫోన్ లో మాట్లాడతానని.. కలిసి పోరాటం చేస్తామని ఒకటి రెండు సార్లు ప్రకటించారు. ఇప్పుడు జనసేన నేతలు బీజేపీ పోరాటాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇంత కాలం లేని సహకారం ఇప్పుడే ప్రారంభం కావడంతో… అంతర్గతంగా ఏదో జరిగే ఉంటుందని… పవన్ కల్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. పురందేశ్వరి వైసీపీపై పోరాటం విషయంలో రాజీ పడరని భావించడంతోనే జనసేన క్యాడర్ కు బీజేపీ ధర్నాల్లో పాల్గొనే అనుమతి ఇచ్చారని అంటున్నారు. కారణం ఏదైనా ఇప్పటికి బీజేపీ, జనసేన ఉమ్మడి ఉద్యమాలు ప్రారంభించినట్లయింది.
మరిన్ని భారీ పోరాట ప్రణాళికలు ఉమ్మడిగా చేసే చాన్స్
బీజేపీ , జనసేన రాష్ట్ర సమస్యలపై ఇక నుంచి ఉమ్మడిగా పోరాడే అవకాశం ఉంది. బయటకు తెలియకపోయినా రెండు పార్టీల నేతలు … అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై పురందేశ్వరి చేసిన ఆరోపణలకు సంబంధించి.. వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు .. అక్రమ అప్పులు.. ఆర్థిక లావాదేవీలు.. అక్రమ మద్యం వ్యాపారాలపై తీవ్ర స్థాయిలో పోరాటాలు చేయాలనుకుంటున్నారని చెబుతున్నారు. అక్రమాలకు ఆధారాలను కేంద్రానికి ఇచ్చి పోరాటం ద్వారా చర్యలు తీసుకునేలా చేస్తే ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల్లో బీజపీ, జనసేన ఉమ్మడి కార్యాచారణ ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పవన్ – పురందేశ్వరి చర్చలు జరుపుతారా ?
పవన్ కల్యాణ్ తో సమావేశం అవుతానని పురందేశ్వరి గతంలో ప్రకటించారు. అయితే పవన్ వారాహియాత్రలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర బాధ్యతలు కొత్తగా చేపట్టినందున.. పురందేశ్వరి కూడా బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో చాలా బిజీగా ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఇద్దరు నేతలు సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత పొత్తులు.. ఎన్నికల్లో కలసి పోటీ చేయడంపై ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.