ఉత్తర ప్రదేశ్లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయి చాన్నాళ్లయ్యింది. యోగి దెబ్బకు సమాజ్ వాదీ పార్టీ కుదేలై కూడా చాలా రోజులైంది. తమ పార్టీ పునరుజ్జీవ ప్రయత్నాల్లో భాగంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సరికొత్త ప్రయోగాలకు తెరతీస్తున్నారు. ఈ క్రమంలోని ఇండియా గ్రూపు నాయకత్వాన్ని దాదాపుగా తన నెత్తికెత్తుకునే పనిచేశారు. కాంగ్రెస్ తో యూపీలో సీట్ల సర్దుబాటును ప్రకటించేశారు..
డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్
2017లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సమాజ్ వాదీ పార్టీ రాజకీయంగా పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ పార్టీ మళ్లీ కాంగ్రెస్ తో చేతులు కలిపింది . మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్ వాదీకి కొన్ని సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ ఒప్పుకోలేదు. ఐనా ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీతో అంటకాగేందుకు ఎస్పీ సిద్దమైంది. ఉత్తర ప్రదేశ్లోని 80 లోక్ సభా స్థానాల్లో 62 చోట్ల ఎస్పీ పోటీ చేయబోతోంది. 17 స్థానాలను కాంగ్రెస్, ఒక స్థానాన్ని మరో చిన్న పార్టీకి వదిలేసింది. ఐనా సరే కాంగ్రెస్ కు 17 స్థానాలు ఎందుకు ఇచ్చారన్నది పెద్ద ప్రశ్నే. ఎందుకంటే గత ఎన్నికల్లో 12 చోట్ల ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఒక్క చోట అసలు పోటీ చేయలేదు. బన్సగామ్ లో అభ్యర్థిని పెట్టలేని స్థితిలో కాంగ్రెస్ ఉన్నది..
అమేఠీలో కూడా ఓటమే..
కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీకి చెందిన రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో అమేఠీ నుంచి ఓడిపోయారు. కాన్పూర్ సిటీ,షారాన్పూర్ సహా పలు చోట్ల మట్టి కరిచారు. రాయ్ బరేలీలో మాత్రమే సోనియా గెలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 67 చోట్ల పోటీ చేయగా, 63 నియోజకవర్గాల్లో డిపాజిట్లు పోగొట్టుకుంది. అమ్రోహాలో కేవలం ఒక శాతం ఓట్లు సాధించింది. అక్కడ బీఎస్పీ అభ్యర్థి డేనిష్ అలీ ఆరు లక్షల పైచిలుకు ఓట్లు సాధించి గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 12 వేల ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం డేనిష్ అలీని బీఎస్పీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన అమ్రోహా నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ప్రయాగ్ రాజ్ లో కాంగ్రెస్ కు 3.5 శాతం, బులంద్షార్ లో 2.62 శాతం, మథురలో 2.5 శాతం, మహారాజ్ గంజ్ లో 5.5 శాతం, ఘాజియాబాద్ లో 7 శాతం ఓట్లు వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిందేమిటి…?
2017 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. 403 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100 సీట్లు కేటాయిస్తున్నట్లు అప్పట్లో అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఫలితాల నాటికి గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఏడు సీట్లు మాత్రమే వచ్చాయి. 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత క్షీణించి రెండు సీట్లకు పరిమితమైంది. ప్రియాంకాగాంధీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పెట్టినప్పటికీ ప్రయోజనం కనిపించలేదు. అలాంటి పార్టీతో ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కలుస్తున్నారు… ఏం జరుగుతుందో…