రెగ్యులర్ గా తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల చలికాలంలో అనారోగ్యం దరిచేరదంటారు నిపుణులు. రోగనిరోధక శక్తిని పెంచడంలో పల్లీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎముకలు బలంగా మారాలన్నా పల్లీలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
వంటింట్లో కచ్చితంగా ఉండే ఆహార పదార్థాల్లో పల్లీలు ఒకటి. దాదాపు అన్ని వంటకాల్లో పల్లీలను ఉపయోగిస్తుంటారు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, బి విటమిన్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. పల్లీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా చలికాలంలో పల్లీలతో ఎన్నో లాభాలు కలుగుతాయంటారు.
శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పల్లీలు కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు గుప్పెడు పల్లీలను తీసుకోవడం అలవాటుగా మార్చుకుంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. పల్లీల కారణంగా చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
డిప్రెషన్ పరాల్
ఈ మధ్య కాలంలో చాలా మంది డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి ఎన్నో మానసిక సమస్యలకు పల్లీలతో చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. పల్లీల్లో ఉండే ట్రిప్టోఫాన్.. శరీరంలో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో డిప్రెషన్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.
ఎముకలకు బలం
పల్లీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఇందులో ఉండే మాంగనీస్, భాస్వరంలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కంటి ఆరోగ్యం
పల్లీల్లో ఉండే జింక్ శరీరంలో విటమిన్ ఏని ఉత్పత్తి చేస్తుంది. ఇది కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా పల్లీలను తీసుకోవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రేచీకటి సమస్యతో బాధపడేవారికి పల్లీలు ఎంతగానో ఉపయోగపడతాయి.
నాన్ వెజ్ కి ప్రత్యామ్నాయం
నాన్ వెజ్ తినే అలవాటు లేని వారికి పల్లీలు మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు పల్లీల్లో పుష్కలంగా ఉంటాయి. గుప్పెడు పల్లీల్లో 7.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.