సరస్వతీ దేవీ సకల విద్యాస్వరూపిణి. ఆ అమ్మవారిని హిందువులు మాత్రమే కాదు జైనులు, బౌద్ధులు కూడా ఆరాధిస్తారు. కంబోడియా, థాయిలాండ్ వంటి దేశాల్లో కూడా సరస్వతీదేవిని ఆరాధిస్తారు. మన దేశంలో సరస్వతీదేవిని పూజించే కొన్ని ఆలయాలున్నాయి…
బాసర
తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, బాసరలో గోదావరి నది ఒడ్డున జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారి విగ్రహాన్ని వ్యాసమహర్షి ప్రతిష్టించినట్లు ప్రతీతి. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టాన్ని చూసి ఇక్కడికి వచ్చి తపస్సు చేసాడని, ప్రతి రోజు ఉదయం గోదావరిలో స్నానం చేసి మూడు పిడికిళ్ల ఇసుక తెచ్చి మూడు కుప్పలుగా పోసి పుజించాడని, ఆ మూడు ఇసుక కుప్పలే సరస్వతి, లక్ష్మి, కాళికా రుపొందాయని స్థలపురాణం. ఈ ఆలయంలో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల విశ్వాసం.
కాట్రా
జమ్మూ – కాశ్మీర్ రాష్ట్రంలో కాట్రా అనే ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. త్రికూట పర్వత గుహలో ఈ ఆలయం వెలసింది. మనదేశంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా చెప్పబడే వాటిలో వైష్ణోదేవి ఆలయం కూడా ఒకటి. పూర్వం జగన్మాత భూలోకంలో ధర్మాన్ని రక్షించి, ప్రజలని కాపాడేందుకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు తమ తేజస్సు నుంచి ఒక దివ్య శక్తిగా ఆవిర్భవించింది. ఇలా ఆదిశక్తి మూడు అంశలతో సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపం ధరించి వైష్ణోదేవిగా ఇక్కడ పిండరూపంలో ఆవిర్భవించింది.
కాళేశ్వరం
తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరంలో అతి ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే. ఒకే పానవట్టావం పైన పక్క పక్కనే రెండు శివలింగాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రవేశ ద్వారం ముందు సరస్వతి మందిరం ఉంది.
శృంగేరి
కర్ణాటక రాష్ట్రం, తుంగభద్ర నది ఒడ్డున శృంగేరి వద్ద ఈ ఆలయం ఉంది. ఇక్కడ వెలసిన శారదాదేవి జ్ఞానికి, విజ్ఞాన సర్వస్వానికి తల్లి లాంటిది. ఆదిశంకరాచార్యుల వారు తానూ నిత్యం పూజానిమిత్తం తన ఇష్టదైవం అయినా శారదాదేవి మూర్తిని మంచి గంధపు చెక్కతో చేయించి ప్రతిష్టించుకున్నారు.
పనచిక్కడు
కేరళ కొట్టాయంలో ఉంది ఈ ఆలయం. సరస్వతీ దేవి కొలువైన ఈ ఆలయాన్ని దక్షిణ మూకాంబిక దేవాలయం అనికూడా పిలుస్తారు. కేరళలో ఉన్న ప్రముఖ సరస్వతీ దేవి ఆలయాల్లో పనచిక్కడు సరస్వతీ ఆలయం ఒకటి
మెదక్
మెదక్ జిల్లాలో ఉంది విద్యా సరస్వతి ఆలయం. దీనిని కంచి శంకరమఠం నిర్వహిస్తోంది. 1989 లో ఇదే రోజు అంటే వసంతపంచమి రోజు ఈ ఆలయానికి భూమిపూజ జరిగింది
కూతనూరు
కూతనూరు మహాసరస్వతి ఆలయం తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ జిల్లా కూతనూర్ లో ఉంది. పురాణాల ప్రకారం రాజరాజచోళుడు ఈ ఆలయాన్ని ప్రఖ్యాతకవి ఒట్టకూతర్ కు విరాళంగా ఇచ్చాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి కూతనూర్ అని పిలుస్తారని అంటారు