ఇక్కడ మూలవిరాట్టు గర్భగుడిలో కాదు కొలనులో ఉంటుంది

ఏ ఆలయంలో అయినా మూలవిరాట్టు విగ్రహాలన్నీ గర్భగుడిలోనే ఉంటాయి. కానీ కేరళ కొట్టాయంలో ఉన్న ఈ ఆలయంలో మాత్రం మూలవిరాట్టు గర్భగుడిలో కాకుండా కొలనులో కొలువై ఉంటుంది.. ఏంటక్కడి ప్రత్యేకత..

కేరళ రాష్ట్రం కొట్టాయంలోని పనచ్చిక్కాడు గ్రామంలో ఉన్న సరస్వతి దేవి ఆలయం ఇది. ఇక్కడ చదువుల తల్లి ఏడాది పొడవునా ప్రకృతి మధ్యే దర్శనమిస్తుంది. పచ్చని లతల మధ్య చిన్న కొలనులో కొలువైన ఈ ఆలయం నిత్యం అక్షరాభ్యాస్యాలతో కళకళలాడుతుంటుంది. దక్షిణ మూకాంబికగా పిలిచే ఈ ఆలయాన్ని భక్తులు దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ముఖ్యంగా రచయితలూ, సంగీత నాట్య కళాకారులూ, చిత్రకారులూ అమ్మ అనుగ్రహం పొందేందుకు ఇక్కడకు వస్తుంటారు. ఈ గుడికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని చెబుతారు స్థానికులు. కిళపురం, కరునాట్టు, కైముక్కు అనే మూడు బ్రాహ్మణ కుటుంబాలు ఈ ఆలయ బాధ్యతల్ని చూస్తుంటారు

స్వయంభువుగా వెలసిన విగ్రహం
ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలసిందనడానికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు కిళప్పురం ఇల్లం నంబూద్రి అనే భక్తుడు మగసంతానం కోసం తీర్థయాత్రలు మొదలెట్టాడట. కాశీకి చేరుకునే మార్గంలో ఈ ఆలయం ఉన్న ప్రదేశం వద్ద ఆగి..ఆ ప్రాంతం నచ్చడంతో అక్కడే ఏడాది పాటు ఉండిపోయాడు. అక్కడ ఉన్నన్ని రోజులూ నిత్యం అమ్మవారు కలలో కనిపించేది..ఓ రోజు కలలో కనిపించిన అమ్మవారు నువ్వు పుట్టిన ఊర్లోనే ఓ స్త్రీ ఇద్దరు పిల్లల్ని కంటుందని వారిలో ఒకర్ని దత్తత తీసుకోవాలని చెప్పింది. అమ్మవారి ఆజ్ఞ మేరకు సొంతూరికి వెళ్లేందుకు సిద్ధమైన భక్తుడు ఆ పక్కనే ఉన్న కొలనులో స్నానం చేయాలని భావించి తనదగ్గరున్న తాటాకుల గొడుగును అక్కడున్న మెట్లపై పెట్టాడు. ఆ తర్వాత దాన్ని ఎంత ప్రయత్నించినా ఎత్తలేకపోవడంతో అప్పుడే అక్కడకు వచ్చిన ఓ స్వామిజీ ఆ గొడుగులో అమ్మవారి శక్తి ఉందనీ ఆ శక్తిని అక్కడి అడవిలో ఉన్న అమ్మవారి విగ్రహానికి చేరవేయమనీ చెప్పాడట. అలా అమ్మవారిని గుర్తించి పూజలుచేసి వెళ్లిపోయాడా భక్తుడు. అప్పటి నుంచీ అమ్మవారు అక్కడే కొలువై పూజలు అందుకుంటోందని చెబుతారు. ఆ తర్వాత అమ్మవారి విగ్రహం అక్కడి నుంచి తీసుకొచ్చి ఓ లోతట్టు ప్రాంతంలో ప్రతిష్టించారు..అదే కొలనుగా మారింది. అప్పటి నుంచీ అమ్మవారికి అక్కడే పూజలందిస్తున్నారు.

ఏడాది పొడవునా నీరు ఊరుతూ స్వయంభువు అయిన అమ్మవారి విగ్రహాన్ని తాకుతుంటాయి. వేసవిలోనూ ఆ తడి ఆరదని చెబుతారు.నవరాత్రుల సమయంలో విద్యార్థులూ, రచయితలూ తమ పుస్తకాలను అమ్మవారి దగ్గర ఉంచి విజయదశమి రోజున తిరిగి తీసుకుంటారు. కేరళలోని కొచ్చి విమానాశ్రయం నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయానికి కొట్టాయం రైల్వేస్టేషన్‌ నుంచి కూడా వెళ్లొచ్చు.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.