సంపద పంపిణీ – కాంగ్రెస్ కు బీజేపీ గట్టి సమాధానాలు

కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించాల్సిన పని లేదు. ఆ పార్టీ నేతలే కాంగ్రెస్ ను ఓడిస్తారు. పైగా ఇన్ని రోజులున్నా రాజకీయ పరిణితి లేకుండా మాట్లాడే రాహుల్ గాంధీని ఎవరూ ఆపలేకపోతున్నారు. విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం రాహుల్ గాంధీకి అలవాటైపోయి..తనన తాను ఇరాకటంలో పడేసుకుంటారు. కొందరు కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ మద్దతుదారులు ఆయనకు వత్తాసు పలుకుతూ పార్టీని మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంటారు. అరే భయ్ మాట్లాడే పద్ధతి ఇది కాదని చివరకు బీజేపీ పెద్దలు సైతం ఉపదేశం చేసేందుకు ప్రయత్నించినా కాంగ్రెస్ నేతలు మారే పరిస్థితి కనిపించదు. జాతీయ ప్రధానాంశాలపై కాంగ్రెస్ చేసే నిర్హేతుకమైన కామెంట్స్ ను బీజేపీ గట్టిగా విమర్శిస్తోంది…..

సంపదను తిరిగి పంపిణీ చేస్తారట…

ఏప్రిల్ 6న రాహుల్ గాంధీ తన తెలివి మొత్తాన్ని వాడేసి ఒక డైలాగ్ వదిలారు. దేశ సంపదను (ఆయన హిందుస్థాన్ కీ ధన్ అని ఒక మాట అనేశారు) లెక్కించి ఎవరి దగ్గర ఎంత పేరుకుపోయిందో లెక్కగడతానన్నారు. సంపదను పునపంపిణీ చేస్తామని ప్రకటించారు. కుల గణన తర్వాత ఈ పని జరుగుతుందన్న రేంజ్ లో ఆయన మాట్లాడేశారు. అక్కడితో ఆగకుండా ఆయన విప్లవాత్మక చర్యలు (క్రాంతికారీ) అని మరో మాట కూడా అనేశారు. ఆయన తనను తాను వ్లాడిమీర్ లెనిన్, కార్ల్ మార్క్స్, ఏంజెల్స్ తరహాలో ఆలోచించుకుంటున్నారన్న ఫీలింగ్ కూడా కొందరిలో వచ్చేసింది. ఇప్పుడు కమ్యూనిస్టు చైనాలోనే అలాంటి ఆలోచనను పక్కన పెట్టేసినప్పుడు ఈ రాహుల్ గాంధీకి ఏమైందంటూ కొందరు ప్రశ్నించిన మాట వాస్తవం. రాహుల్ చెప్పే అర్థసత్యాలు, అసత్యాలు, పొంతనలేని వ్యాఖ్యలను విమర్శిస్తూ వస్తున్న బీజేపీ ఈసారి సంపద స్టేట్ మెంట్ విషయంలో కూడా గట్టిగానే ఎదురుదాడి చేసింది.

మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను గుర్తుచేసిన బీజేపీ…

రాహుల్ వ్యాఖ్యలను ఎన్నికల వేళ ప్రధాని మోదీ కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. ఎక్కువ పిల్లలను కనే వారికి సంపదను కట్టబెట్టాలని చూస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలను సైతం ఆయన గుర్తు చేశారు. దేశ వనరులపై తొలి హక్కు ముస్లింలకు ఉండాలన్నట్లుగా అప్పట్లో మన్మోహన్ మాటలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. రాజస్థాన్లోని టోంక్ – సవాయ్ మాథోపూర్ ఎన్నికల సభలో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రజల సంపదను లాగేసుకుని… ఎంపిక చేసిన కొందరికి పంచే కుట్రకు దిగుతోందని మోదీ నిగ్గు తేల్చారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ను తగ్గించేసి దాన్ని ముస్లింలకు అందించే ప్రయత్నం కూడా జరుగుతోందని మోదీ అన్నారు…

పిత్రోడా తెలివి తక్కువ వ్యాఖ్యలు…

ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా ఏదో మాట్లాడేసి కాంగ్రెస్ పార్టీని మరింత ఇరకాటంలో పడేశారు. రాజీవ్ గాంధీ హయాంలో రద్దు చేసిన వారసత్వ సంపదపై పన్నును మళ్లీ ప్రవేశ పెడతామని ప్రకటించారు. పైగా అమెరికాలో తండ్రి చనిపోయిన తర్వాత పిల్లలకు వచ్చే ఆస్తిపై 55 శాతం పన్ను ఉంటుందని పిత్రోడా గుర్తుచేశారు. దీనితో ఒక సభలో ప్రధాని మోదీ ఆయన్ను ఉతికి ఆరేశారు. ఎల్ఐసీ నినాదమైన జిందగీకే బాద్ భీ…అని చిన్న పాటను ప్రస్తావిస్తూ… కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే చచ్చిన తర్వాత కూడా దేశ ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వరని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్మును పిల్లలకు ఇవ్వకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఆయన గుర్తుచేశారు. 2012లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ఇలాంటి ప్రస్తావనే చేశారని గుర్తు చేస్తూ చచ్చినోళ్లను కూడా వదిలి పెట్టరా అని బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జీ అమిత్ మాలవీయ ప్రశ్నించారు. పిట్రోడా చేసిన పనికి సమాధానం చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీ నిజంగానే చచ్చిపోతోంది…