టీడీపీ బిగ్ షాక్ తగలింది. రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త, భారత ప్రభుత్వం నుంచి నారీశక్తి పురస్కారం అందుకున్న పాలకొండ నియోజవర్గానికి చెందిన పడాల భూదేవి దంపతులు జనసేనలో చేరారు. ఈ మేరకు అనకాపల్లిలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పాలకొండలో జనసేన జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇంతకు ముందే జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలోని ST రిజర్వుడు స్థానమైన పాలకొండలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి 2014, 2019లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మరోసా ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని తహతహ లాడుతున్నారు. అటు కూటమి వైపు మాత్రం అభ్యర్థి ఎవరు అనేదే ఇంకా తేలలేదు. పైగా కూటమి అభ్యర్ధి ఎంపిక విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు, రోజుకో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
టీడీపీ టిక్కెట్ కోసం జయకృష్ణ, భూదేవి ప్రయత్నాలు
పాలకొండ నియోజకవర్గంలో ముందు నుంచి YCP వర్సెస్ TDP మధ్య ప్రధాన పోరు కొనసాగుతూ వచ్చింది. అదే సమయంలో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చిన జయకృష్ణకు స్వపక్షంలో విపక్షంలా సొంత పార్టీ నాయకుల అసమ్మతి పోరు నెలకొంది. జయకృష్ణ నాయకత్వాన్ని కాదంటూ పార్టీలోని ఓ వర్గం సామాజిక కార్యకర్తగా ఉన్న పడాల భూదేవిని ప్రోత్సహిస్తూ వచ్చింది. టీడీపీ టికెట్‌ను ఆశిస్తూ భూదేవి నియోజకవర్గంలో జయకృష్ణకి పోటీగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతు వచ్చారు. జయకృష్ణకి టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు అనుచరుడుగా పేరుండగా.. భూదేవికి అచ్చెన్నాయుడు ప్రోత్సాహం ఉన్నట్లు సమాచారం.
వారిద్దరినీ పార్టీలో చేర్చుకున్న పవన్
పాలకొండ సీటు జనసేనకు కేటాయించటంతో టీడీపీలోని నిమ్మక జయకృష్ణకి, పడాల భూదేవికి చెక్ పడిందని అంతా భావించారు. ఇక ముందు నుంచి జనసేనలో ఉన్న SBI మాజీ ఉద్యోగి నాగేశ్వరావుకు ఆపార్టీ టికెట్ వరిస్తుందని భావించారు. అధిష్టానం కూడా నాగేశ్వరరావును విజయవాడకి పిలిచి అతని ఆర్థిక పరిస్థితి, ఎన్నికల్లో పోటీకి దిగితే తట్టుకునే సామర్థ్యంపై చర్చించారట. అయితే ఇంతలోనే తాజాగా మరిన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. నిమ్మక జయకృష్ణ, పడాల భూదేవి ఇద్దరూ జనసేనలో చేరిపోయారు. టీడీపీ సమస్యను జనసేన నెత్తిన పెట్టుకున్నట్లయిందన్న వాదన వినిపిస్తోంది.