బీజేపీ సీనియర్లకు నిరాశ – వారు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు ?

ఏపీ బీజేపీలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్లందరికీ పోటీ చేసే అవకాశం వస్తుందని అనుకున్నా.. అలాంటి అవకాశాలు కనిపించలేదు. పొత్తులో భాగంగా వచ్చిన ఆరు లోక్ సభ సీట్లలో సీనియర్లకు అవకాశం కలిపించలేదు. దీనిపై సీనియర్ నేతల్లో అసంతృప్తి లేకపోయినా… పార్టీ క్యాడర్ కు మాత్రం తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఐదుగురు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే

ఆరుగురు ఎంపీ అభ్యర్థులలో ఐదుగురు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఉండటంతో సహజంగానే బ్యాలెన్స్ తప్పిందన్న అభిప్రాయం పార్టీ క్యాడర్ లో వినిపిస్తోంది. సీఎం రమేష్ కు అనకాపల్లి స్థానం కేటాయించారు. నిజానికి ఆయనది కడప జిల్లా. ఆయనకు అనకాపల్లికి ఎలాంటి సంబంధం లేదు. కమ్యూనిటీ పరంగా కూడా కాపు లేదా గవర వర్గానికి అనకాపల్లికేటాయిస్తారు. కానీ సీఎం రమేష్ ఆ వర్గాలకు చెందిన వారు కాదు. ఇది ఆశ్చర్యకర నిర్ణయంగా మారింది. ఇక కొత్తపల్లి గీత. వరప్రసాద్ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే.

పార్టీనే నమ్ముకుని ఉన్న సీనియర్ల పోటీకి చాన్స్ లేనట్లేనా

ఉత్తరాంధ్రలో పీవీఎన్ మాధవ్.. జీవీఎల్ నరసింహారావు . రాయలసీమలో విష్ణువర్ధన్ రెడ్డి.. కోస్తా జిల్లాలో సోము వీర్రాజు వంటి సీనియర్ నేతలు పోటీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. పొత్తుల్లో లభించే కొన్ని సీట్లలో అయినా సీనియర్లు పోటీ చేసే సీట్లు లభిస్తాయని అనుకున్నారు. కానీ వీరికి నిరాశే ఎదురవుతోంది . ఎంపీ అభ్యర్థుల్లో చోటు దక్కలేదు.. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కూడా వీరి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లుగా సమాచారం లేకపోవడంతో కార్యకర్తల్లో నిరాశ కనిపిస్తోంది.

అవకాశాలతో సంబంధం లేకుండా పార్టీకి నిబద్దులే !

ఏపీ బీజేపీ కోసం దశాబ్దాలుగా కష్టపడుతున్న వారు.. పార్టీ సిద్దాంతాల కోసం పని చేసే వారు. వారికి అవకాశాలు లభిస్తే పోటీ చేస్తారు లేకపోతే.. పార్టీ కోసం పని చేస్తారు. అయితే కష్టపడిన వారికి ప్రతిఫలం లభించకపోతే.. కాస్త నిరాశ చెందుతారు. క్యాడర్ కూడా పార్టీ కోసం పని చేయాల్సిన అవసరం ఏముందనన్న అభిప్రాయానికి వస్తారు. అలాంటివి రాకుండా హైకమాండ్ చూసుకోవాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.